గ్వాంగ్‌జూ (చైనా): ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-19, 21-17 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)ను ఓడించి విజేతగా అవతరించింది. మరొకవైపు ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించింది.
టైటిల్ పోరులో సింధు-ఒకుహారాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. తొలి గేమ్‌లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఒకుహారా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహారీ నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్ దక్కించింది. దాంతో స్కోరు 16-16 గా సమం అయ్యింది. అటు తర్వాత జోరు పెంచిన సింధు వరుస పాయింట్లతో దుమ్మురేపింది. తొలుత ఒక పాయింట్ సాధించి ఆధిక్యం సాధించిన సింధు.. వరుసగా రెండు స్మాష్‌లతో ముందంజ వేసింది. అదే జోరును తిరిగి కొనసాగించడంతో తొలి గేమ్‌ను సింధు దక్కించుకుంది.
ఇక రెండో గేమ్‌లో సింధు 3-0 తో పైచేయి సాధించింది. ఆపై సింధు రెండు పాయింట్లు, ఒకుహారా నాలుగు పాయింట్లు సాధించడంతో ఇరువురు మధ్య వ్యత్యాసం తగ్గింది. కాకపోతే సింధు మరోసారి విజృంభించి ఆధిక్యాన్ని సాధించింది. రెండో గేమ్‌లో ఎక్కడ ఆధిక్యాన్ని కోల‍్పోకుండా వచ్చిన సింధు చివరకు మ్యాచ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా టైటిల్‌ను సాధించింది.
కేసీఆర్ హర్షం..
వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తెలుగు తేజం పీవీ సింధు గెలవడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి గర్వకారణంగా సింధు నిలిచిందని, భష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.
మరిన్ని విజయాలు సాధించాలి: వైఎస్ జగన్
ప‍్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను తొలిసారి గెలిచిన స్టార్ షట్లర్ సింధుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విజయ పరంపరం ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment