క్వార్టర్స్‌లో సింధు, సైనా | Quarters of the sindhu, Saina | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, సైనా

Published Fri, Jan 23 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

క్వార్టర్స్‌లో సింధు, సైనా

లక్నో: సయ్యద్ మోడి స్మారక గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ జోరు కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21-18, 21-14తో జియాన్ చెన్ (సింగపూర్)పై గెలవగా... టాప్‌సీడ్ సైనా 21-15, 21-9తో రీతూపర్ణ దాస్‌ను ఓడించింది. తద్వారా ఈ ఇద్దరు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. జియాన్‌తో కేవలం 31 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు దూకుడును ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 7-7, 14-14తో స్కోరు సమమైనా... చివర్లో వరుస పాయింట్లతో 19-16 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియాన్ రెండు పాయింట్లు గెలిచినా... హైదరాబాదీ ముందు నిలువలేకపోయింది. ఇక రెండో గేమ్‌లో 4-4తో స్కోరు సమమైన తర్వాత సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో చకచకా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించింది.

పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ కిడాంబి శ్రీకాంత్ 22-20, 20-22, 21-11తో  జైనుద్దీన్ (మలేసియా)పై కష్టపడి గెలిచాడు. గంటా ఏడు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాద్ కుర్రాడు ఒక్కసారిగా చెలరేగిపోయాడు. స్కోరు 3-3, 4-4తో సమమైన తర్వాత ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. కనిష్టంగా రెండు పాయింట్లకు తక్కువ కాకుండా గెలుస్తూ జైనుద్దీన్ దెబ్బతీశాడు. స్కోరు 18-11 ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో 3వ సీడ్ పారుపల్లి కశ్యప్... 11వ సీడ్ మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. స్కోరు 21-16, 20-12 ఉన్న దశలో జిబ్బెర్మాన్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బి.సాయి ప్రణీత్ 21-16, 24-26, 21-13తో 15వ సీడ్ సుపాన్యు అవింగ్‌సనాన్ (థాయ్‌లాండ్)పై; 8వ సీడ్ ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 21-16, 21-19తో థామసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్ర-అరుణ్; నందగోపాల్-అర్జున్; మను అత్రి-సుమీత్ రెడ్డి జంటలు; మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని; జమునా రాణి-లీలా లక్ష్మీ జంటలు క్వార్టర్స్‌కు చేరాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement