కోల్‌కతా: ‘‘కొన్ని విషయాలు అంతేనండీ, ఓ బాధపడుతూ కూర్చోవాల్సిన పనిలేదు. వీలైనంత తొందరగా అన్నీ మర్చిపోవాలి. మళ్లీ రీచార్జ్ అవ్వాలి. ఓటమి బారి నుంచి ఎంత తొందరగా బయటపడతామన్నదే ఆటలో కీలకం. నాయకుడిగా నా 11 మంది సైన్యాన్ని నమ్మాను. ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాను. ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్ కు వెళతామన్న పట్టుదల వాళ్లలో కలుగజేస్తాను. కెప్టెన్‌గా ఏం చెయ్యాలో అదే చేస్తాను’’ అంటున్నాడు దినేశ్ కార్తీక్.
ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 102 పరుగుల తేడాతో ఘోరపరాజయం తర్వాత డీకే స్పందన ఇది. 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కతా.. ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. అయితే, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని డీకే ధీమావ్యక్తం చేశాడు.
పరాజయంపై పోస్ట్‌మార్టం: ‘‘మా ఓటమికి ప్రధాన కారణం క్యాచ్‌డ్రాప్స్. రెండో కారణం ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్. ఆ తర్వాత అనవసర రనౌట్స్. నిజానికి 200పైచిలుకు లక్ష్యం ఎప్పుడూ టఫ్‌గానే ఉంటుంది. పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లు కోల్పోవడంతో.. ఆ తర్వాత కూడా మేం కోలుకోలేకపోయాం. క్యాచ్‌లు జారవిడిచిన ఫలితంగానే ముంబై అంత భారీ స్కోరు చేసింది. మిడిల్ ఓవర్స్‌లో ఇషాన్ చెలరేగిపోయాడు. అతణ్ని కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు’’ అని దినేశ్ కార్తీక్ చెప్పాడు.
మ్యాచ్ రిపోర్ట్: బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 62; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పీయూష్ చావ్లాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. పాండ్యా బ్రదర్స్ కృనాల్, హార్దిక్ చెరో 2 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment