రద్వాన్‌స్కాకు షాక్
పిరన్‌కోవా సంచలనం
* ఆరో సీడ్ హలెప్ కూడా అవుట్
* ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలన ఫలితాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్), ఆరో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టారు. గతంలో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా ఏనాడూ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయిన బల్గేరియా ప్లేయర్ స్వెతానా పిరన్‌కోవా ధాటికి రద్వాన్‌స్కా...
యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సమంత స్టోసుర్ దూకుడుకు హలెప్ చేతులేత్తేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ పిరన్‌కోవా 2-6, 6-3, 6-3తో ప్రపంచ రెండో ర్యాంకర్ రద్వాన్‌స్కాను ఓడించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6-2, 3-0తో ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల ఆగిపోయింది. సోమవారం వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. మంగళవారం మ్యాచ్ మొదలయ్యాక 29 ఏళ్ల పిరన్‌కోవా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్‌లో పిరన్‌కోవా అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హలెప్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోసుర్ 7-6 (7/0), 6-3తో విజయం సాధించింది. తద్వారా మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్‌లో 3-5తో వెనుకబడ్డ 2011 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టోసుర్ వెంటనే తేరుకొని స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్‌లో ఒకసారి హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్టోసుర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని గెలిచింది.
వెంటాడిన వర్షం
మంగళవారం కూడా ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వీడలేదు. ఫలితంగా పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. బాటిస్టా అగుట్ (స్పెయిన్)తో జరుగుతున్న మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి సెట్‌ను 3-6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6-4తో నెగ్గాడు. మూడో సెట్‌లో ఈ సెర్బియా స్టార్ 4-1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.