దుబాయ్: మైదానంలో క్రీడా స్ఫూర్తిని పక్కకు పెట్టి మరీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు నియంత్రణ కోల్పోయి తమ నోటికి పని చెప్పారు.
గురువారం క్వెటా గ్లాడియేటర్స్-కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో భాగంగా రహత్ అలీ వేసిన 16 ఓవర్‌లో ఇమాద్ వసీం అవుటయ్యాడు. ఆ వికెట్‌ను సాధించిన ఆనందంలో రహాత్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది ఇమాద్ వసీంకు కోపం తెప్పించింది. రహాత్ అలీ వైపు చూస్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు.
దానికి సమాధానంగా రహత్ అలీ 'ఇక నువ్వు స్టేడియంలోకి వెళ్లు' అనే అర్ధం వచ్చేలా చేయి చూపించాడు. దాంతో మరింత ఆవేశానికి గురైన ఇమాద్.. రహత్ అలీ మీదకు దూసుకొచ్చే యత్నం చేశాడు. అయితే వికెట్ కీపర్ సర్ది చెప్పి రహత్ అలీని పక్కకు తీసుకు వెళ్లగా, ఇమాద్ మాత్రం తిట్టుకుంటూ మైదానం విడిచాడు. కాగా, పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడిన ఇద్దరు క్రికెటర్ల మధ్య ఇలా మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment