కరాచీ: తాను కారు ప్రమాదంలో చనిపోయినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్న ఇర్ఫాన్.. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను ఎందుకు వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం మహ్మద్ ఇర్ఫాన్ ట్వీటర్‌లో పలు పోస్టింగ్‌లు వెలుగు చూశాయి. కారు ప్రమాదంలో ఇర్ఫాన్ మృతి చెందాడంటూ కొంతమంది ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్.. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. కొంతమంది కావాలని తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డాడు. (‘అతని వల్లే సచిన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’)
అసలు ఇలా మరణించానంటూ ఎందుకు వైరల్ చేస్తున్నారో తనకైతే అర్థం కావడం లేదన్నాడు. ఇది తన కుటుంబాన్ని పూర్తిగా అయోమయానికి గురి చేయడమే కాకుండా తీవ్రంగా బాధించిందన్నాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి లెక్కనేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయన్నాడు. వారందరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, తాను, కుటుంబం క్షేమంగా ఉన్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఈ తరహా ఫేక్ న్యూస్‌ను వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే విషయం దాన్ని సృష్టించిన వారు తెలుసుకోవాలన్నాడు. 38 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్.. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తరఫున 4 టెస్టు, 60 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 10 వికెట్లు, వన్డేల్లో 83 వికెట్లు, టీ20ల్లో 16 వికెట్లను ఇర్పాన్ తీశాడు. 7 అడుగుల, 1 అంగుళం ఎత్తు ఇర్ఫాన్‌ది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఎత్తు కల్గిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. (సెంచరీ కొట్టకపోతే వేస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment