ఇస్లామాబాద్ : క్రికెట్ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుంచి మొదలుకొని సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటతీరును చూశాం.. చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆటలో తమ నైపుణ్యతను అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇలా ఏదో ఒక దాంట్లో తమ మెళుకువలను చూపెడుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, ఇయాన్ బోథమ్ సహా ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఇదే కోవలోకి వస్తారు. కానీ కొంతమంది మాత్రం ప్రదర్శనతో కాకుండా తమ రూపురేఖలతో ఆకట్టుకుంటారు. క్రికెట్‌లో అత్యంత పొడవైన క్రికెటర్‌గా పాక్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇర్ఫాన్ పొడవు .. 7 అడుగుల 1అంగుళం. (చదవండి : ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా)
2010లో పాక్ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఇర్ఫాన్ తన బౌన్సర్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ రికార్డును పాక్‌కే చెందిన ముదస్సార్ గుజ్జర్ అనే కుర్రాడు బద్దలు కొట్టాడు. గుజ్జర్ పొడవు 7 అడుగుల 6 అంగుళాలు. ముదస్సార్ గుజ్జర్ గతేడాది నవంబర్‌లో లాహోర్ క్వాలాండర్స్ డెవలప్‌మెంట్ లో చేరి కోచ్, ట్రైనర్ల సహాయంతో బౌలర్‌గా శిక్షణ పొందుతున్నాడు. గుజ్జార్ ఎక్కువ పొడవు కావడంతో ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కఠోర సాధన చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పాక్ తరపున దేశవాలి క్రికెట్‌లో ఆడి పేరు సంపాదించి ఆపై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్నాడు. తాజాగా ముదస్సార్ గుజ్జార్‌ను కలిసిన ఒక జర్నలిస్ట్ అతనితో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. ' ముదస్సార్ గుజ్జార్ పొడవు.. 7 అడుగుల 6 అంగుళాలు, షూ సైజ్ 23.6.. ఇంత పొడవు క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా.. మీట్ విత్ ముదస్సార్ గుజ్జార్' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(చదవండి : ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’)
సాధారణంగా విండీస్ నుంచి వచ్చే క్రికెటర్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆరు అడుగులకు పైగానే ఉంటారు. మన టీమిండియాలో కూడా అత్యంత పొడగరి ఎవరంటే ఇషాంత్ శర్మ పేరు టక్కున చెబుతారు. ఇషాంత్ శర్మ పొడవు 6 అడుగుల 5అంగుళాలు. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత పొడవైన క్రికెటర్లుగా మహ్మద్ ఇర్ఫాన్(పాకిస్తాన్), జోయల్ గార్నర్(వెస్టిండీస్), బ్రూస్ రీడ్(ఆస్ట్రేలియా), కర్ట్‌లీ ఆంబ్రోస్(వెస్టిండీస్), టామ్ మూడీ( ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), క్రిస్ ట్రెమ్లెట్( ఇంగ్లండ్), పీటర్ ఫుల్టన్(న్యూజిలాండ్), షాహిన్ ఆఫ్రది(పాకిస్తాన్), ఇషాంత్ శర్మ( ఇండియా) తొలి పది స్థానాల్లో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment