ఈసారి టైటిల్ మాదే!
►కబడ్డీ ఎప్పుడూ బోర్ కొట్టదు
► ‘సాక్షి’తో రాహుల్ చౌదరి
సాక్షి, హైదరాబాద్: కబడ్డీలో అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిం చినా, ప్రొ కబడ్డీ లీగ్ తర్వాతే గుర్తింపు లభించి ఒక్కసారిగా హీరోగా మారిన ఆటగాడు రాహుల్ చౌదరి. లీగ్ తొలి మూడు సీజన్లలో కూడా టాప్ రైడర్లలో ఒకడిగా అతను నిలిచాడు. ఇప్పుడు మరోసారి రాహుల్ తెలుగు టైటాన్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వేలంకు ముందు టైటాన్స్ రిటెయిన్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లలో అతను ఒకడు. శుక్రవారం లీగ్ వేలం ముగిసిన అనంతరం రాహుల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...
మళ్లీ టైటాన్స్‌కు ఆడటం: జట్టు మేనేజ్‌మెంట్ నాపై నమ్మకం ఉంచటం సంతోషం. లీగ్ ఆరంభమైన దగ్గరినుంచి టైటాన్స్‌తో నా అనుబంధం కొనసాగుతోంది. ఈ జట్టు తరఫున నాకు మంచి అవకాశాలు లభించాయి. కెప్టెన్‌గా కూడా చాన్స్ ఇచ్చారు. ఒక దశలో గాయంతో కొంత ఇబ్బంది పడ్డా ఫ్రాంచైజీ నాకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే జట్టు రిటెయిన్ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నా.
టైటిల్ గెలవకపోవడం: మూడు సీజన్లలో మేం బాగా ఆడాం. కొన్ని కీలక క్షణాల్లో మ్యాచ్‌లను కోల్పోయాం. వ్యక్తిగతంగా నేను బెస్ట్ ప్లేయర్ సహా ఎన్ని అవార్డులు గెలిచినా జట్టు గెలవలేదనే నిరాశ ఉంది. ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నా. పక్కా ప్రణాళికతో సిద్ధమవుతాం. మా లోపాలను సరిదిద్దుకుంటాం. టైటాన్స్‌కు టైటిల్ అందించడమే నా లక్ష్యం.
కొత్త జట్టు: టీమ్‌లో నేను, సుకేశ్ మాత్రమే ఇప్పటి వరకు కలిసి ఆడాం. మిగతా వారంతా కొత్తవారే. అయితే వీరిలో చాలా మందితో నేను ప్రొ కబడ్డీ ఆరంభం కాక ముందునుంచీ, ఆ తర్వాత భారత్ తరఫున కలిసి ఆడాను కాబట్టి సమన్వయానికి సమస్య లేదు. జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. వారినుంచి మంచి ఆటను రాబట్టడం ముఖ్యం. సందీప్ నర్వాల్, జస్మీర్ సింగ్‌లతో మా బలం పెరగ్గా... ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఫలితాన్ని మార్చగల సమర్థులు.
ఏడాదిలో రెండు సార్లు టోర్నీ జరగడం: ప్రొ కబడ్డీ తొలి సీజన్ హిట్ అంటే రెండో సీజన్ అంతకంటే సూపర్ హిట్ అయింది. మూడో సారి కూడా మాకు మంచి స్పందన లభించింది. కాబట్టి మళ్లీ అదే స్థాయిలో జనాదరణ ఆశిస్తున్నాం. లీగ్ అప్పుడే అయిపోయిందా, మరిన్ని మ్యాచ్‌లు ఉంటే బాగుండేది అంటూ చాలా మందినుంచి వచ్చిన స్పందనను నేను కూడా చూశాను. అదే కారణంతో నిర్వాహకులు కూడా ఏడాదికి రెండు సార్లు చేసినట్లున్నారు. అయితే ప్లేయర్‌గా ఒక్క మాట చెప్పగలను. కబడ్డీ ఎప్పుడూ బోర్ కొట్టదు. ఆటలో మజా ఉంటుంది కాబట్టి టోర్నీ ఎక్కువ సార్లు జరిపినా నష్టం లేదు.
ఆటకు పెరిగిన ఆదరణ: ఒక్కసారిగా జనాలు కబడ్డీ వైపు ఈ లీగ్ ద్వారా ఆకర్షితులయ్యారనడంలో సందేహం లేదు. మా గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. అదే తరహాలో లీగ్ కాకుండా ఇతర కబడ్డీ మ్యాచ్‌లు, భారత జట్టు ఆడే మ్యాచ్‌లను అభిమానించాలని కోరుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇటీవల ‘శాఫ్’ క్రీడల్లో విజేతగా నిలిచిన తర్వాత మేం అందరి దృష్టిని ఆకర్షించగలగడం మంచి పరిణామం.