ద్రావిడ్కు మరో కీలక బాధ్యత
న్యూఢిల్లీ: భారత్ ఏ, అండర్-19 జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్కు మరో కీలక బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో ద్రావిడ్తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ టిమ్ మేను నియమించారు. వీరు మూడేళ్ల పాటు కమిటీలో కొనసాగనున్నారు. పదవీకాలం ముగిసిన సంగక్కర, లక్ష్మణ్, మార్క్ టేలర్ స్థానాల్లో వీరిని ఎన్నుకున్నారు. ఈ నెల 31, జూన్ 1న జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ తొలిసమావేశంలో వీరు పాల్గొంటారు.
కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. 2012లో కుంబ్లేకి తొలిసారి ఈ బాధ్యతలు అప్పగించారు. తాజా నియామకంతో కుంబ్లే 2018 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. కమిటీలో అంపైర్ల ప్రతినిధిగా స్టీవ్ డేవిస్ స్థానంలో రిచర్డ్ కెటిల్బరో ఎన్నికయ్యాడు.