ఈసారైనా రాత మారేనా? | Rahul Dravid Excited To Have Fit-Again Zaheer Khan Back For Delhi Daredevils | Sakshi
Sakshi News home page

ఈసారైనా రాత మారేనా?

Published Sun, Apr 2 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఈసారైనా రాత మారేనా?

ఈసారైనా రాత మారేనా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జరిగిన ప్రతిసారీ దాదాపుగా ‘అనామక’ జట్టుగా అందరి దృష్టిలో నిలిచేది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (డీడీ) అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటిదాకా జట్టు స్వరూపాన్ని పరిశీలిస్తే ఇందులో ఆడిన ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతులకేమీ తక్కువ లేదు. సెహ్వాగ్, గంభీర్, వార్నర్, డి విలియర్స్, జయవర్ధనే, దిల్షాన్, మోర్కెల్‌ ఇలా ఉద్ధండులే ఈ జట్టు తరఫున గతంలో పోరాడారు. అయితే రెండు సార్లు సెమీస్‌కు చేరడం మినహా డీడీ సాధించిందేమీ లేదు. ఎప్పుడూ కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగడం.. చేదు అనుభవాలను చవిచూడటం అలవాటుగా మారింది. గత సీజన్‌లో పర్వాలేదనిపించినా ఈసారి డుమిని, డి కాక్‌ అందుబాటులో లేకపోవడం.. దాదాపుగా కొత్త ఆటగాళ్లతో సీజన్‌ను ప్రారంభించబోతున్న ఢిల్లీ జట్టు అందరి అంచనాలను మించి రాణిస్తుందో.. లేదో మరి!

సాక్షి క్రీడా విభాగం
ఐపీఎల్‌ ఆరంభమైన 2008తో పాటు మరుసటి ఏడాది కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు ఫుల్‌ జోష్‌గా కనిపించింది. వీరేంద్ర సెహ్వాగ్‌ నేతృత్వంలో జట్టు ఆ రెండు పర్యాయాలు సెమీఫైనల్స్‌కు దూసుకువచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఏడు సీజన్లలో డీడీ ఆట పూర్తిగా గతి తప్పి చిట్టచివరి స్థానాల కోసం పోటీ పడాల్సి వచ్చింది. 2012లో జరిగిన ఐదో సీజన్‌లో మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరగలిగింది. ఇక చివరి మూడు సీజన్లలో 2014లో ఎనిమిదో స్థానం ఆ తర్వాత 7, 6వ స్థానాల్లో నిలిచింది. గత సీజన్‌లో కూడా రూ.16 కోట్లు పెట్టి కొనుక్కున్న యువరాజ్‌ సింగ్, రూ. 7.5 కోట్లు పెట్టి కొన్న ఏంజెలో మాథ్యూస్‌ సహా చాలా మంది ఆటగాళ్లను తప్పించింది.

అయితే రూ.8.5 కోట్లు పెట్టి పవన్‌ నేగిని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. జహీర్‌ ఖాన్‌కు పగ్గాలు అప్పగించి ప్యాడీ ఆప్టన్‌ హెడ్‌ కోచ్‌గా, బ్యాటింగ్‌ మెంటార్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను నియమించుకుంది. దీంతో తమ తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి సంచలనం సృష్టించింది. కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుతుందని అంతా భావించారు. అయితే ఆ తర్వాత రెండు మ్యాచ్‌లనే గెలిచి 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఈసారి పవన్‌ నేగి, టి20ల్లో నంబర్‌వన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌లతో పాటు దాదాపు సగం జట్టును కూడా వదులుకుని ఆశ్చర్యపరిచింది. కానీ ఈసారి కాస్త జాగ్రత్తగా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నట్టే కనిపిస్తోంది.

ఆశలు రేకెత్తిస్తున్న బ్యాటింగ్‌ విభాగం: రాహుల్‌ ద్రవిడ్‌ మెంటార్‌గా సేవలందిస్తున్న ఈ జట్టులో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లున్నారు. శ్రేయస్‌ అయ్యర్, కరుణ్‌ నాయర్, సంజూ శామ్సన్, రిషభ్‌ పంత్‌ తమ ఆటతీరును గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. వీరంతా భారత్‌ ‘ఎ’ తరఫున కూడా ఆడటంతో ద్రవిడ్‌ శిక్షణ రాటుదేల్చింది. వీరు నిలకడగా రాణిస్తే జట్టుకు ప్రయోజనమే. అయితే చెప్పుకోదగ్గ స్వదేశీ ఆల్‌రౌండర్‌ జట్టులో లేడు. దీంతో మోరిస్, అండర్సన్, మాథ్యూస్, బ్రాత్‌వైట్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. లోయర్‌ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్‌ చేయగల సత్తా జట్టుకు ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో జహీర్‌తో పాటు షమీ, ఈసారే జట్టులోకి వచ్చిన పేసర్‌ రబడ, కమిన్స్‌తో పాటు స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కీలకం కానున్నారు.  

మార్పులే దెబ్బతీస్తున్నాయి: ప్రతీ సీజన్‌కు జట్టు కొత్త రూపుతో బరిలోకి దిగుతుండటం విజయావకాశాలను దెబ్బతీస్తోంది. దీనికి తోడు కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్‌ ఏస్థాయిలో ఉందో తెలియాల్సి ఉంది. దీనికి తోడు సీజన్‌ ఆరంభానికి ముందే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జేపీ డుమిని వ్యక్తిగత కారణాలతో, క్వింటాన్‌ డి కాక్‌ గాయంతో దూరం కావడం జట్టును షాక్‌లో ముంచింది. వీరిద్దరి గైర్హాజరీ డీడీ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

రెండు సార్లు సెమీఫైనల్స్‌కు...: 2008, 2009 సీజన్‌లో మెరుగ్గా ఆడిన ఢిల్లీ జట్టు సెమీఫైనల్స్‌కు చేరి ఆకట్టుకున్నా... రాజస్తాన్‌ రాయల్స్, దక్కన్‌ చార్జర్స్‌లపై ఓడింది. ఇక 2012లో కోల్‌కతా, చెన్నై జట్లతో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో ఓడింది.
ఈసారి పరిస్థితి...: రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో జట్టు పరిస్థితి ఈసారి మెరుగుపడుతుందనే ఆశతో ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంది. ముఖ్యంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆడనుంది.

జట్టు: స్వదేశీ ఆటగాళ్లు: జహీర్‌ (కెప్టెన్‌), షమీ, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శామ్సన్, మయాంక్‌ అగర్వాల్, అంకిత్‌ బానే, జయంత్‌ యాదవ్, సౌరభ్‌ తివారి, షాబాజ్‌ నదీమ్, కరుణ్‌ నాయర్, సీవీ మిలింద్, ఖలీల్‌ అహ్మద్,, ఆదిత్య తారే, మురుగన్‌ అశ్విన్, అమిత్‌ మిశ్రా, శశాంక్‌ సింగ్, ప్రత్యూష్‌ సింగ్, నవదీప్‌ సైని. విదేశీ ఆటగాళ్లు: రబడ, కమిన్స్, మోరిస్, మాథ్యూస్, కోరె అండర్సన్, బ్రాత్‌వైట్, బిల్లింగ్స్‌.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement