
నాకొద్దీ పదవి..!
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నుంచి తప్పుకున్నారు. సీఓఏలోని నలుగురు సభ్యులలో ఒకరైన గుహ,
సీఓఏ నుంచి తప్పుకున్న గుహ
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)నుంచి తప్పుకున్నారు. సీఓఏలోని నలుగురు సభ్యులలో ఒకరైన గుహ, వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను గురువారం ఆయన సుప్రీం కోర్టులో సమర్పించారు. అయితే ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉన్నందున ఆయన రాజీనామాను ఆమోదించే విషయాన్ని కోర్టు జులై 14కు వాయిదా వేసింది.
తన నిర్ణయం గురించి ఆయన బీసీసీఐకి, సీఓఏలోని ఇతర సభ్యులకు ముందే చెప్పినట్లు సమాచారం. భారత క్రికెట్ బోర్డులో సమస్యలను చక్కదిద్ది సరైన దిశలో మార్గనిర్దేశనం చేసేందుకు నలుగురు సభ్యులతో సుప్రీం కోర్టు జనవరి 30న సీఓఏను నియమించింది. గుహ రాజీమానాతో ఇప్పుడు ఈ కమిటీలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ మిగిలారు.
అదే కారణమా...
సీఓఏ సభ్యుడైన తర్వాత కూడా రామచంద్ర అంటీ ముట్టనట్టే ఉన్నారు. తనకున్న ఇతర వ్యాపకాల కారణంగా సీఓఏ నిర్వహించిన సమావేశాలకు ఆయన పెద్దగా హాజరు కాలేదు. అయినా సరే ఆయన రాజీనామా అనూహ్య పరిణామం. దీనిని అనిల్ కుంబ్లే వివాదంతో సంబంధం ఉన్న అంశంగా బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కుంబ్లేతో గుహకు మంచి సాన్నిహిత్యం ఉంది. నిజానికి కుంబ్లే చేసిన ఫీజుల పెంపు తదితర ప్రతిపాదనల వెనక కూడా గుహనే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో కోచ్‌గా కుంబ్లే భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలోనే గుహ కావాలనే తప్పుకున్నారని వినిపిస్తోంది. ‘రామచంద్ర గుహ మంచి మేధావి. క్రీడలు, చరిత్రకు సంబంధించిన అంశాల్లో ఆయనకు చాలా పట్టుంది. అయితే క్రికెట్ పరిపాలన అనేది పూర్తిగా భిన్నమైన వ్యవహారం. అది ఐసీసీ అయినా బీసీసీఐ అయినా అంత సులువు కాదు. వినోద్ రాయ్, లిమాయేలాంటివాళ్లే కిందా మీదా పడిపోతున్నారు. అందుకే ఆయన తప్పుకొని ఉంటారు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు ఈ పరిణామంపై వ్యాఖ్యానించారు.