నేడే ‘ఆఖరు’
ఓటమి అంచున పాక్
లంక విజయం లాంఛనమే
కొలంబో: 17 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్న శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనేకు జట్టు ఆటగాళ్లు చిరస్మరణీయ కానుక ఇవ్వబోతున్నారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టును ఆతిథ్య జట్టు గెలుచుకోవడం ఇక లాంఛనమే. ఇప్పటికే ఈ సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే. 271 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌ను స్పిన్నర్ రంగన హెరాత్ (4/46) మరోసారి చావుదెబ్బ తీశాడు.
ఫలితంగా 40 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. చివరి రోజు సోమవారం విజయానికి మరో 144 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో సర్ఫరాజ్ (63 బంతుల్లో 38 బ్యాటింగ్; 1 ఫోర్), రియాజ్ (2 బ్యాటింగ్) ఉన్నారు. 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును షఫీఖ్ (62 బంతుల్లో 32; 5 ఫోర్లు)తో కలసి సర్ఫరాజ్ ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు వీరు 55 పరుగులు జోడించారు. హెరాత్ మిడిలార్డర్ పనిబట్టడంతో పాక్ కోలుకోలేకపోయింది. స్లిప్‌లో జయవర్ధనే రెండు క్యాచ్‌లు తీసుకున్నాడు.
జయవర్ధనే అర్ధ సెంచరీ
అంతకుముందు శ్రీలంక 177/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించి 109 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటయ్యింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను జయవర్ధనే (137 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముగించి అభిమానులను అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఓవరాల్‌గా 149 టెస్టుల్లో 11,814 పరుగులు సాధించినట్టయ్యింది. అజ్మల్ వరుస ఓవర్లలో సంగక్కర (130 బంతుల్లో 59; 4 ఫోర్లు), జయవర్ధనే అవుట్ కావడంతో లంక ఇబ్బంది పడింది. కెప్టెన్ మాథ్యూస్ (119 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. రియాజ్, అజ్మల్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.