సెమీస్‌కు రంగారెడ్డి రైజర్స్‌ | rangareddy risers enters semis of t20 league | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు రంగారెడ్డి రైజర్స్‌

Published Thu, Feb 22 2018 10:31 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

rangareddy risers enters semis of t20 league - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్‌ లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్‌ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడింట్లో గెలుపొందిన రైజర్స్‌ 14 పాయింట్లతో లీగ్‌ టాపర్‌గా నిలిచింది. హైదరాబాద్‌ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... మెదక్‌ మావెరిక్స్‌ (12 పాయింట్లు), ఆదిలాబాద్‌ టైగర్స్‌ (10 పాయింట్లు) జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అయితే హైదరాబాద్, ఆదిలాబాద్‌ జట్లు మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. లీగ్‌ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుతాయి.  

ఉప్పల్‌ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ జట్టు 8 పరుగుల తేడాతో కరీంనగర్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు సాధించింది. వినయ్‌ గౌడ్‌ ( 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ప్రతీక్‌ (48) రాణించాడు.  అనంతరం 172 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కరీంనగర్‌ వారియర్స్‌ జట్టును వీకేసీ ఆశిష్‌ రెడ్డి (4/23) దెబ్బతీశాడు. అతని ధాటికి వారియర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. నితీశ్‌ రెడ్డి ( 64; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బి. రాహుల్‌ (51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. రంగారెడ్డి బౌలర్‌ ఆశిష్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో ఆదిలాబాద్‌ టైగర్స్‌పై నిజామాబాద్‌ నైట్స్, కాకతీయ కింగ్స్‌పై ఖమ్మం టిరా, నల్లగొండ లయన్స్‌పై మెదక్‌ మావెరిక్స్‌ గెలుపొందాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement