తడబడి... నిలబడి...
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మహారాష్ర్ట మొదట తడబడినా తర్వాత నిలబడింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయినా ఆ జట్టు కోలుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
అంకిత్ బావ్నే (172 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. ఓపెనర్ చిరాగ్ ఖురానా (145 బంతుల్లో 64; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి బావ్నేతో పాటు సంగ్రామ్ అతీత్కర్ (66 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌కు 2 వికెట్లు దక్కాయి.
కట్టడి చేసిన బౌలర్లు
టాస్ గెలిచిన మహారాష్ట్ర బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఇబ్బంది పడ్డ ఓపెనర్ హర్షద్ ఖడివాడే (15)ను వినయ్ ఎల్బీగా పంపడంతో మహారాష్ట్ర తొలి వికెట్ కోల్పోయింది. భారత అండర్-19 కెప్టెన్ జోల్ (5) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో ఖురానా, కేదార్ జాదవ్ (44 బంతుల్లో 37; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో పాండే క్యాచ్ వదిలేయడంతో ఖురానా బతికిపోగా... ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాదవ్ దూకుడు ప్రదర్శించాడు. అయితే అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో జాదవ్ పెవిలియన్ చేరడంతో మహారాష్ట్ర ఇబ్బందుల్లో పడింది.
కీలక భాగస్వామ్యాలు
లంచ్ విరామం తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఖురానా 126 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం కరుణ్ నాయర్ బౌలింగ్‌లో ఖురానా నిష్ర్కమించాడు. మరో వైపు ఓపిగ్గా ఆడిన బావ్నే 102 బంతుల్లో అర్ధసెంచరీని చేరుకున్నాడు. టీ బ్రేక్ అనంతరం కెప్టెన్ మొత్వాని (17) అవుట్ కావడంతో 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అతీత్కర్‌తో కలిసి బావ్నే మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు.
స్కోరు వివరాలు
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: ఖడీవాలే (ఎల్బీడబ్ల్యూ బి) వినయ్ 15; ఖురానా (ఎల్బీడబ్ల్యూ బి) నాయర్ 64 ; జోల్ (సి) గౌతమ్ (బి) అరవింద్ 5; జాదవ్ (సి) గౌతమ్ (బి) మిథున్ 37; బావ్నే (బ్యాటింగ్) 89; మొత్వాని (సి) గౌతమ్ (బి) మిథున్ 17; అతీత్కర్ (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 272.
వికెట్ల పతనం: 1-24; 2-42; 3-90; 4-144; 5-215.
బౌలింగ్: వినయ్ 23-5-56-1; మిథున్ 19-6-44-2; అరవింద్ 23-6-62-1; మనీశ్ పాండే 1-0-2-0; గోపాల్ 13-0-54-0; నాయర్ 5-1-21-1; వర్మ 4-0-14-0; గణేశ్ 2-0-8-0.
ఆదరణ శూన్యం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్‌లో అతి పెద్ద టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బీసీసీఐని కూడా ఆలోచనలో పడేస్తుందేమో. రంజీ ఫైనల్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అదే తరహాలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో పదుల సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ఆ తర్వాత కాస్త పెరుగుతూ వచ్చినా మొత్తంగా ఈ సంఖ్య దాదాపు 200కు మించి లేదు.
ఒక స్కూల్ నుంచి 50 మంది విద్యార్థులు వచ్చినా కొద్ది సేపు తర్వాత వారంతా వెళ్లిపోయారు. ఫైనల్ చూడమంటూ హెచ్‌సీఏ ప్రవేశం కల్పించినా అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. తమ సొంత జట్టు లేకపోవడం, ఇరు జట్లలోనూ తెలిసిన ఆటగాళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. దీనికన్నా ఇరు జట్లకు సంబంధించిన వేదికల్లో ఎక్కడైనా నిర్వహిస్తే కనీసం ఒక టీమ్ కోసమన్నా ప్రేక్షకులు మ్యాచ్‌కు వచ్చేవారు.
ఐదుగురు సెలక్టర్లూ....
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఐదుగురూ రంజీ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని సీఎం బాక్స్ నుంచి వీరు మ్యాచ్‌ను తిలకించారు. బీసీసీఐ క్రికెట్ డెవలప్‌మెంట్ మేనేజర్ రత్నాకర్ షెట్టి కూడా ఫైనల్‌కు వచ్చారు.