రంజీ ట్రోఫీ చరిత్రలో 40 సార్లు విజేత ముంబైకి ఈ సీజన్ ఆరంభంలో తొలి మ్యాచ్‌లోనే పెద్ద షాక్ తగిలింది. జమ్మూ కశ్మీర్ జట్టు సంచలన ప్రదర్శనతో ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.
రంజీలో ముంబైపై నాలుగు వికెట్లతో గెలుపు
ముంబై: రంజీ ట్రోఫీ చరిత్రలో 40 సార్లు విజేత ముంబైకి ఈ సీజన్ ఆరంభంలో తొలి మ్యాచ్‌లోనే పెద్ద షాక్ తగిలింది. జమ్మూ కశ్మీర్ జట్టు సంచలన ప్రదర్శనతో ముంబైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌట్ కాగా... కశ్మీర్ 254 పరుగులకు ఆలౌటై 18 పరుగుల ఆధిక్యం సాధించింది.
తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 254 పరుగులకు ఆలౌటయింది. 237 పరుగుల లక్ష్యాన్ని పర్వేజ్ రసూల్ సారథ్యంలోని కశ్మీర్ 69.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ శుభమ్ ఖజూరియా... రెండో ఇన్నింగ్స్‌లోనూ 78 పరుగులతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
సచిన్ ఓదార్పు: కశ్మీర్ చేతిలో అనూహ్యంగా కంగుతిన్న ముంబై ఆటగాళ్లను సచిన్ ఓదార్చాడు. ఆటగాళ్ల స్థైర్యం దెబ్బతిన కుండా ఉండాలని కోచ్ ప్రవీణ్ ఆమ్రే... సచిన్‌ను పిలిచారు.
ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ 9 వికెట్లతో సౌరాష్ట్రపై, కర్ణాటక 285 పరుగులతో తమిళనాడుపై, పంజాబ్ 120 పరుగులతో హరియాణాపై, హిమాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్ 29 పరుగులతో సర్వీసెస్‌పై విజయం సాధించాయి. బెంగాల్, బరోడా; గోవా, కేరళ; ఒడిశా, మహారాష్ట్ర; మధ్యప్రదేశ్, రైల్వేస్; గుజరాత్, రాజస్థాన్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.