
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆంధ్ర జట్టు సొంతగడ్డపై బెంగాల్‌తో ప్రారంభమైన మ్యాచ్‌ను సానుకూలంగా ప్రారంభించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారి (90; 14 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఆంధ్ర బౌలర్లు చెలరేగడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను తివారి ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు అగ్నివ్ పాన్ (39; 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జతచేశాడు. ప్రస్తుతం వృత్తిక్ చటర్జీ (27 బ్యాటింగ్), ప్రదీప్తా ప్రమాణిక్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, యర్ర పృథ్వీరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్, షోయబ్ ఖాన్‌లకు చెరో వికెట్ దక్కింది. హైదరాబాద్ వేదికగా పంజాబ్‌తో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 240/7తో నిలిచింది.
46 ఏళ్ల వయసులో...
శనివారం మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన ప్లేట్ గ్రూప్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అరుదైన ఘనత నమోదైంది. మణిపూర్ తరఫున టోక్‌చోమ్ ఇబోయైమా సింగ్ రంజీల్లో అరంగేట్రం చేశాడు. బరిలోకి దిగే సమయానికి టోక్‌చోమ్ వయసు 45 ఏళ్ల 296 రోజులు కావడం విశేషం. ఫలితంగా అతి పెద్ద వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఆటగాళ్ల జాబితాలో అతనూ చేరాడు. 1973 మార్చి 1న టోక్‌చోమ్ పుట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 16 పరుగులకే 5 వికెట్లు తీసి అరుణాచల్‌ను 66 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment