
బెంగళూరు: అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక జట్టు టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా రషీద్ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. గురువారం బెంగళూరు వేదికగా ప్రారంభమైన టెస్టు మ్యాచ్ ద్వారా అఫ్గానిస్తాన్ టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టింది. ఫలితంగా టెస్టు హోదా పొందిన 12 దేశంగా అఫ్గానిస్తాన్ అవతరించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ శతకాలు సాధించగా.. లోకేష్ రాహుల్ 54 పరుగులతో మెరిశాడు. ఇక రెండో రోజు ఆటలో రెండో రోజు హార్దిక్ పాండ్యా (94 బంతుల్లో 71), ఉమేష్ యాదవ్ (21 బంతుల్లో 26 నాటౌట్) వేగంగా ఆడారు.
భారత బ్యాట్స్‌మెన్ దూకుడు ధాటికి టీ20ల్లో అగ్రశ్రేణి బౌలర్ అయిన రషీద్ లాంగ్ ఫార్మాట్‌లో తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లు వేసిన అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ 154 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఫలితంగా చెత్త రికార్డును రషీద్ తన ఖాతాలో వేసుకున్నాడు.
గతంలో అరంగేట్రపు టెస్టులో అత్యధిక పరుగుల‍్ని సమర్పించుకున్న రికార్డు పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ పేరిట ఉండేది. పాకిస్తాన్ 1952లో భారత్‌పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో అమీర్ 134 పరుగులు ఇవ్వగా.. తాజాగా రషీద్ దాన్ని అధిగమించి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment