హైదరాబాద్ శుభారంభం
తొలి మ్యాచ్‌లో కేరళపై గెలుపు
ముస్తాక్ అలీ ట్రోఫీ
సాక్షి, విశాఖపట్నం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్‌జోన్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ శుభారంభం చేసింది. హైదరాబాద్ ఓపెనర్ రవితేజ (68 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దాంతో కేరళతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆల్‌రౌండ్ నైపుణ్యం కనబర్చింది.
తొలుత బ్యాటింగ్... అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు అవకాశమివ్వకుండా చెలరేగింది. ఇక్కడి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (13)తో ఇన్నింగ్స్ ఆరంభించిన రవితేజ తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (36 బంతుల్లో 47, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 126 పరుగులు జతచేశాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేరళ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ రాకేశ్ (41 బంతుల్లో 48, 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చిచ్చర పిడుగు సంజూ శామ్సన్ (16) విఫలమయ్యాడు. సచిన్ బేబి 24 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఏ దశలోనూ కేరళ లక్ష్యంవైపు సాగలేదు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 3 వికెట్లు పడగొట్టగా... అమోల్ షిండే, ఆశిష్ రెడ్డి, ఆకాశ్ భండారి తలా 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: అక్షత్‌రెడ్డి (బి) బాసిల్ తంపి 13; రవితేజ నాటౌట్ 101; విహారి రనౌట్ 47; ఆశిష్ రెడ్డి నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 179
వికెట్ల పతనం: 1-44, 2-170
బౌలింగ్: బాసిల్ తంపి 4-0-27-1, సందీప్ 3-0-40-0, ప్రశాంత్ 4-0-21-0, పరమేశ్వరన్ 4-0-43-0, రాకేశ్ 4-0-37-0, మనోహరన్ 1-0-9-0.
కేరళ ఇన్నింగ్స్: రాకేశ్ (సి అండ్ బి) షిండే 48; జగదీశ్ (సి) రవితేజ (బి) ఆశిష్ 16; శామ్సన్ (సి) రాహుల్ (బి) షిండే 16; జాఫర్ జమాల్ (స్టంప్డ్) అహ్మద్ (బి) భండారి 1; ప్రేమ్ (సి) రాహుల్ (బి) భండారి 15; సచిన్ బేబి (సి) భండారి (బి) ఆశిష్ రెడ్డి 24; మనోహరన్ (సి) విహారి (బి) ఓజా 13; ప్రశాంత్ (స్టంప్డ్) అహ్మద్ (బి) ఓజా 6; బాసిల్ తంపి నాటౌట్ 0; పరమేశ్వరన్ (బి) ఓజా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 145
వికెట్ల పతనం: 1-56, 2-77, 3-81, 4-87, 5-123, 6-125, 7-145, 8-145, 9-145
బౌలింగ్: అమోల్ షిండే 4-0-28-2, రవికిరణ్ 2-0-15-0, కనిష్క్ నాయుడు 3-0-30-0, ఆశిష్ రెడ్డి 4-0-30-2, ప్రజ్ఞాన్ ఓజా 4-0-21-3, ఆకాశ్ భండారి 3-0-19-2.
రవితేజ అజేయ శతకం
Published Wed, Apr 2 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement