బెంగళూరు : మ్యాచ్ మధ్యలో బాల్ మాయమైంది. చుట్టూ కెమెరాలు.. మైదానంలో ఆటగాళ్లు, అంపైర్లు.. వేలకొద్ది అభిమానులు.. అంత మంది ఉండి కూడా బాల్ ఎక్కడికిపోతుంది? అంటారా? అవును బాల్ కొద్దిసేపు కనబడకుండా పోయి ఆటగాళ్లను, అంపైర్లను అయోమయానికి గురిచేసింది. పోని బ్యాట్స్‌మెన్ బంతిని గ్రౌండ్ అవతలికి కొట్టాడా? అంటే అది లేదు. స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ ముందు వరకు ఉన్న బంతి.. అనంతరం కనిపించకుండా పోయింది. బౌలింగ్ వేయడానికి బౌలర్ సిద్దంగా ఉన్నాడు.. క్రీజులో బ్యాట్స్‌మన్ రెడీ అయ్యాడు. కానీ బంతి లేదు. ఏమైంది..? బంతి ఎక్కడా? అవును ఎక్కడా అందరూ ఇదే.! క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ.. కనివిని ఎరుగని ఈ వింత హాస్యాస్పదక ఘటన కింగ్స్‌పంజాబ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లిసేన 17 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న బాల్ మిస్సింగ్ ఎపిసోడ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఆ బంతి ఏమైందో తెలుసా!
ఇక ఆటగాళ్లు, అభిమానులను టెన్షన్ పెట్టిన ఆ బంతి ఎక్కడికిపోయిందో చెబితే నవ్వకుండా ఉండలేరు. ‘ఓరి నీ మతిమరుపో’ అని అనకుండా ఉండలేరు. అవును బంతి ఎక్కడికి పోయిందా..? అని టీవీ కెమెరాల సాయంతో ప్రయత్నించగా.. అది అంపైర్ జేబులోనే ఉందని తెలిసింది. దీంతో కామెంటేటర్స్‌తో సహా మైదానంలో ఆటగాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అనంతరం అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ స్ట్రాటజిక్ టైమ్‌ఔట్ అంటూ సిగ్నల్ ఇస్తూ బంతిని లెగ్ అంపైర్ శామ్సుద్దిన్‌కు ఇచ్చాడు. అతను ఆ బంతిని తన జేబులో వేసుకున్నాడు. విరామం అనంతరం 14వ ఓవర్ బౌలింగ్ చేయడానికి అంకిత్ రాజ్‌పూత్ సిద్దం కాగా.. బంతి కనిపించకుండా పోయింది. జేబులో ఉన్న బంతిని అంపైర్ శామ్సుద్దిన్ మరిచిపోయాడు. దీంతో బంతి ఎక్కడా అంటే ఎక్కడా? నీకిచ్చినా నీకిచ్చినా అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో మ్యాచ్ 2 నిమిషాలు ఆగిపోయింది. మరోవైపు ఈ వ్యవహారంతో అంపైర్లపై కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంటేటర్సేమో.. హే బంతిని ఎవరైన తిన్నారా? అని చలోక్తులు విసిరారు. ఇక ఈ వ్యవహారం తేలట్టులేదని గ్రహించిన టీవీ అంపైర్ కెమెరాల సాయంతో బంతిని ట్రేస్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్ (44 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్ (34 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్‌లు), రాహుల్ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment