
అశ్విన్‌తో లబుషేన్
India Vs Australia 2023: అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. కోహ్లితో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తడం బాగుంటుందంటూ తమ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో లబుషేన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
నాలుగు టెస్టుల్లో కలిపి 244 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇక వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్వదేశానికి పయనమైన లబుషేన్.. భారత్‌కు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు.
ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ట్విటర్‌లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్‌లో భాగంగా అరగంట పాటు వారికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన వివిధ ప్రశ్నలకు లబుషేన్ జవాబులు చెప్పాడు.
స్టీవ్ స్మిత్‌తో కాకుండా వేరెవరితో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావని అడుగగా.. విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. ఇక ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరని ప్రశ్నించగా.. రవిచంద్రన్ అశ్విన్ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. ఇటీవల ముగిసిన బీజీటీ-2023 సిరీస్‌లో తనకు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ చుక్కలు చూపించాడని ఈ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అన్నాడు.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానన్న మార్నస్ లబుషేన్.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఈసారి తన పేరును మినీ వేలంలో నమోదు చేసుకోలేదు.
చదవండి: Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్ ఆఫర్ కొట్టేశాడుగా..!
Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..