IPL 2023- RCB- Virat Kohli: ఒక్క టైటిల్.. ఒకే ఒక్క ట్రోఫీ.. అంటూ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు గత పదిహేనేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. క్యాష్ రిచ్ లీగ్ ప్రతి ఎడిషన్ ఆరంభం నుంచే ‘‘ఈసారి కప్ మనదే’’ అంటూ సందడి చేసే ఫ్యాన్స్‌కు ఎప్పటిలాగే ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది.
ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. ముఖ్యంగా ఈసారి విరాట్ కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేస్తూ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వాళ్లపైనే ఆధారపడి
ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన అజేయ సెంచరీ వృథాగా మిగిలిపోయింది. ‘కేజీఎఫ్’(కోహ్లి, గ్లెన్, ఫాఫ్) రూపంలో తమకు లభించిన ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే ప్రతిసారీ ఆధారపడటం.. బౌలింగ్‌లోనూ సిరాజ్ మినహా మిగతా వాళ్లు మరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది.
ఇక కోహ్లికి ఆర్సీబీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతున్న కింగ్.. నేటికీ బంధం కొనసాగిస్తున్నాడు. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఆర్సీబీ ముఖచిత్రంగా మారాడు. బ్యాటర్‌గా తనపై భారం పడితే జట్టుకు నష్టం చేకూరుతుందేమోనన్న ఆలోచనతో గతేడాది సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.
ఆ ఒక్క లోటు
అయితే, క్యాష్ రిచ్ లీగ్‌లో ఎన్ని రికార్డులు సాధించినా.. శతకాల వీరుడిగా పేరొందినా.. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవలేదన్న లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. తాజా సీజన్‌లోనూ అదే పునరావృతమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఢిల్లీకి మారాల్సిన సమయం వచ్చేసింది!
గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘ విరాట్ రాజధాని నగరానికి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా పరోక్షంగా సూచన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారితేనైనా రాత మారుతుందేమోనని అభిప్రాయపడ్డాడు.
ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైర్
అయితే, ఢిల్లీ అభిమానులకు పీటర్సన్ ట్వీట్ విపరీతంగా నచ్చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ‘‘అసలేం మాట్లాడుతున్నావు. కోహ్లి లేని ఆర్సీబీని ఊహించను కూడా ఊహించలేం. పోయి పోయి ఢిల్లీకి మారాలా? నీ ట్వీట్‌కు అర్థం ఏమిటి?
ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడు. లేదంటే తనకిష్టమైన ధోని సారథ్యంలోని సీఎస్‌కేకు ఆడతాడు. అంతేగానీ.. నీ చెత్త సలహాలు ఎవరికీ అవసరం లేదు’’ అంటూ పీటర్సన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
కాగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా.. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది.
చదవండి: ముంబై కోసమే గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. సచిన్ ట్వీట్ వైరల్
#Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి..
Time for VIRAT to make the move to the capital city…! #IPL
— Kevin Pietersen🦏 (@KP24) May 22, 2023
Comments
Please login to add a commentAdd a comment