తొలి మూడు వికెట్లు...చివరి మూడు వికెట్లు!
కాన్పూర్: చారిత్రక టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ విజృంభణ కొనసాగింది. ఈ మ్యాచ్లో అశ్విన్ మొత్తం పది వికెట్లతో రాణించి న్యూజిలాండ్ వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లను తీసే క్రమంలో తొలి మూడు వికెట్లను దక్కించుకున్న అశ్విన్.. చివరి మూడు వికెట్లను కూడా తన ఖాతాలోనే వేసుకోవడం విశేషం.
చివరి మూడు వికెట్లను పడగొట్టే క్రమంలో నిలకడగా ఆడుతున్న సాంట్నార్ను ముందుగా అశ్విన్ అవుట్ చేశాడు.ఆ తరువాత సోథీ, వాగ్నర్లు కూడా అశ్విన్ మాయాజాలంలో పడి పెవిలియన్ కు చేరారు. సోథీని బౌల్డ్ చేసిన అశ్విన్.. వాగ్నర్ను ఎల్బీడబ్యూగా అవుట్ చేసి భారత్ విజయం ఖాయం చేశాడు. అంతకుముందు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో తొలి మూడు వికెట్లను అశ్విన్ సాధించిన సంగతి తెలిసిందే. టాపార్డర్ ఆటగాళ్లు లాథమ్, గప్టిల్, విలియమ్సన్ లు అశ్విన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరారు. ఈ క్రమంలో200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరడమే కాకుండా, అత్యంత వేగవంతంగా టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.
ప్రత్యేకంగా రెండో ఇన్నింగ్స్ లో భారత్ కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చిన అశ్విన్.. మ్యాచ్ కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. దాంతో భారత్ 197 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ తన రెండో ఇన్నింగ్స్లో 236 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్కు చారిత్రక విజయం లభించింది.