భజ్జీ ‘వేడి’ తగ్గింది!
అశ్విన్ ముందు తేలిపోయిన సీనియర్
భవిష్యత్తులో చోటు కష్టమే(నా)!
బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టును ప్రకటించినప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం హర్భజన్ సింగ్‌కు చోటు. దేశవాళీలో అద్భుతాలు ఏమీ చేయకపోయినా... కేవలం కెప్టెన్ కోహ్లి గట్టి మద్దతు కారణంగానే ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌కు స్థానం లభించింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం చేసిన భజ్జీ... తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఫతుల్లాలో ప్రదర్శన పెద్ద వైఫల్యంగా కనబడకపోయినా... జట్టులో ఉన్న మరో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌తో పోలిస్తే మాత్రం తీసికట్టుగానే ఉంది. భజ్జీ బంతుల్లో గతంలో ఉన్న వాడి లేదు.
సాక్షి క్రీడా విభాగం
‘ఒకే మ్యాచ్‌లో హర్భజన్, అశ్విన్ కలిసికట్టుగా బౌలింగ్ చేయడాన్ని కెప్టెన్‌గా నేను ఆస్వాదించాను. ఇద్దరిలో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. భవిష్యత్తులోనూ వీరు ఇలాగే జట్టుకు ఉపయోగపడాలి’... ఫతుల్లాలో టెస్టు ముగిసిన అనంతరం తన ఇద్దరు ఆఫ్ స్పిన్నర్ల గురించి కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది. అయితే మున్ముందు రాబోయే సిరీస్‌లలో జట్టులో ఒకే ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాల్సిన పరిస్థితి వస్తే కోహ్లి ఇదే తరహాలో ఆలోచించగలడా అనేది సందేహం. ఎందుకంటే బంగ్లాదేశ్ బలహీన జట్టు. అందులోనూ ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లను ఆడించగలిగాడు. డివిలియర్స్, ఆమ్లా, సంగక్కర లాంటి క్రికెటర్లపై ఇదే వ్యూహం అక్కరకు రాదు. ఆ జట్లతో టెస్టు ఆడేటప్పుడు ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు తుది జట్టులో ఉండటం దాదాపు అసాధ్యం. వైవిధ్యం కోసం ఒక లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు చోటివ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరిలో బెస్ట్ అయిన అశ్విన్‌కే ఓటు పడుతుంది.
పట్టు దొరకలేదు
బంగ్లాదేశ్‌తో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17.5 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసిన భజ్జీ, రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు బౌల్ చేశాడు. మ్యాచ్ మొత్తం జరిగి ఉంటే గణాంకాలు ఎలా ఉండేవో కానీ... నిజానికి ఒక టెస్టులో ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇది సరిపోదు. ‘ఇది పునరాగమనం అనుకోవద్దు, గాయం వల్ల జట్టుకు దూరం అయ్యానంతే అనే భావనతో ఆడు’ అంటూ కోహ్లి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసినా... భజ్జీలో ఒకరకమైన ఒత్తిడి కనిపించింది. తనకు దొరికిన ఏకైక అవకాశం కోల్పోవద్దనే ఆలోచనతో ఉన్న హర్భజన్.... ఆరంభ ఓవర్లలో సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో విఫలమయ్యాడు.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు స్లిప్, సిల్లీ పాయింట్, షార్ట్ కవర్, గల్లీ స్థానాలలో ఫీల్డర్లతో భజ్జీకి అనుకూలంగా గాలివాటం ఉన్న ఎండ్ నుంచి పదే పదే కోహ్లి బౌలింగ్ చేయించినా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ పెద్దగా ఫలితం రాబట్టలేకపోయాడు. కాస్త కుదురుకున్నాక వికెట్లు దక్కడంతో భజ్జీ ఊపిరి పీల్చుకోగలిగాడు. కైస్‌ను మంచి బంతితో అవుట్ చేయగా...మిగతా రెండు వికెట్లు బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యపు ఆటతో లభించాయి. కానీ మొత్తంగా చూస్తే 35 ఏళ్ల హర్భజన్ బౌలింగ్‌లో నాటి పదును లేదని, పెద్ద జట్లపై ఇది సరిపోదని మాత్రం అర్థమైంది.
అసలైన ఆఫ్ బ్రేక్
మరోవైపు అశ్విన్ మాత్రం తన సీనియర్ కంటే ఒక మెట్టుపైనే నిలిచాడు. భారత్ బయట తొలిసారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్ మ్యాచ్ ఆసాంతం ఆకట్టుకున్నాడు. పిచ్‌ను అతను తొందరగా అంచనా వేయగలిగాడు. ఫలితంగా భజ్జీతో పోలిస్తే ఎక్కువ టర్న్, బౌన్స్ రాబట్టగలిగాడు. పైగా వేరియేషన్ల పేరుతో ఎక్కువగా వైవిధ్యానికి పోకుండా సాంప్రదాయ ఆఫ్ స్పిన్‌ను సమర్థంగా ఉపయోగించాడు. నిలకడగా ఒకే లైన్‌లో బౌలింగ్ వేసి బ్యాట్స్‌మెన్‌ను సందిగ్ధంలో పడేశాడు. తమీమ్, ముష్ఫికర్, షువగత ఇదే కన్ఫ్యూజన్‌లో వికెట్లు సమర్పించుకున్నారు.
అశ్విన్ చేతి నుంచి అంత బాగా బంతి రావడం గతంలో ఎప్పుడూ చూడలేదంటూ మాజీ ఆటగాడు మంజ్రేకర్ ప్రశంసిస్తే... ఐదు వికెట్లూ తెలివైన బంతులకే దక్కాయి అంటూ మరో వ్యాఖ్యాత విశ్లేషించడం ఈ మ్యాచ్‌లో అశ్విన్ ప్రభావమేమిటో చూపించింది. ఇక ఉపఖండంలో అశ్విన్ బ్యాటింగ్ కూడా జట్టుకు అవసరం. కేవలం 23.87 సగటుతో ఇక్కడ 100 వికెట్లు తీసిన అతని బ్యాటింగ్ సగటు కూడా 43.50 ఉండటం విశేషం. ఇదే విషయాన్ని చెబుతూ కోహ్లి... అశ్విన్ ఆటను చక్కగా అర్థం చేసుకోగలడని, అతని విలువ అమూల్యమని స్పష్టం చేశాడు. ఇకపై జరిగే టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా తొలి ప్రాధాన్యత 28 ఏళ్ల అశ్విన్‌కే అనేది ఖాయం.
ముగ్గురు స్పిన్నర్లు ఆడితేనే...
టెస్టు కెప్టెన్‌గా కోహ్లి ఐదుగురు బౌలర్ల ఫార్ములా కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. సాధారణంగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ లైనప్‌ను నింపాలి. విదేశాల్లో అయితే ఏకంగా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఆడాలి. ఈ కాంబినేషన్‌తో జట్టు ఎంపిక చేసినప్పుడు... ఇద్దరు స్పిన్నర్లే తుది జట్టులో ఉంటే భజ్జీ, అశ్విన్ ఒకే మ్యాచ్‌లో ఆడటం కష్టం. అశ్విన్‌ను కాదని హర్భజన్‌ను ఆడిస్తే విమర్శల పాలు కావాల్సి వస్తుంది. కచ్చితంగా ఒక ఆఫ్ స్పిన్నర్‌తో పాటు ఒక లెగ్ స్పిన్నర్‌నో లేదా ఎడంచేతి వాటం స్పిన్నర్‌నో తీసుకోవాలి.
అలా కాకుండా అశ్విన్, హర్భజన్ ఇద్దరూ జట్టులో ఉండాలంటే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. బహుశా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భయంకరమైన స్పిన్ ట్రాక్ తయారు చేసి ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు అలాంటి ట్రాక్‌లు తయారు చేయకపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఆడాలంటే మాత్రం అశ్విన్‌ను దాటి భజ్జీ తుది జట్టులోకి రావడం కష్టమే అనుకోవాలి. ఇక ఉపఖండం బయట మ్యాచ్‌లు ఆడితే హర్భజన్‌కు తుది జట్టులో చోటు అసాధ్యం. అక్కడ ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో ఆడాల్సి వస్తుంది.