హర్భజన్, రవిచంద్రన్ అశ్విన్
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది.
న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు.
మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్.
నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్‌లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment