హ్యాట్సాఫ్ ‘సర్‌జీ’ | Ravindra 'Sir' Jadeja helps India sneak tie with New Zealand in Auckland | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్ ‘సర్‌జీ’

Published Sun, Jan 26 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

హ్యాట్సాఫ్ ‘సర్‌జీ’

హ్యాట్సాఫ్ ‘సర్‌జీ’

ఓడిపోయే మ్యాచ్‌ను కాపాడిన జడేజా
 భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే టై
 రాణించిన అశ్విన్, ధోని
 
 కష్టమో... నిష్టూరమో... అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కొంటూ ధోని ఇన్నాళ్లూ జడేజా, అశ్విన్‌లను కొనసాగించాడు. ఇంతకాలానికి ఈ ఇద్దరూ కలిసి ధోని మాట దక్కించారు. భారత్ ఓడిపోవడం ఖాయమనుకున్న మ్యాచ్‌ను వీరోచితంగా పోరాడి ‘టై’ చేశారు. ముఖ్యంగా ‘సర్’ జడేజా సంచలన బ్యాటింగ్‌తో ఆఖరి బంతి వరకూ ఒత్తిడిని అధిగమించి... టెయిలెండర్ల సాయంతో భారత్ సిరీస్‌ను కోల్పోకుండా కాపాడాడు.

 
 
 ఆక్లాండ్: భారత ఆటగాళ్ల పోరాటపటిమతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆశలు సజీవంగా నిలిచాయి. తనలోని పూర్తి స్థాయి సామర్థ్యాన్ని బయటకు తీసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (45 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటంతో ఆకట్టుకోగా, అశ్విన్ (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్సర్) తన బ్యాటింగ్ ప్రతిభను చూపెట్టాడు. ఇక గెలుపు కష్టమే అనుకున్న మ్యాచ్‌ను ఈ ఇద్దరు తమదైన శైలిలో ఆడి ‘టై’ చేశారు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే టైగా ముగియడంతో... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది.
 
 
  ఇక భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా సిరీస్ దక్కదు. కాకపోతే చివరి రెండూ గెలిస్తే సిరీస్‌ను డ్రా చేసుకోవచ్చు. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. గుప్టిల్ (129 బంతుల్లో 111; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (74 బంతుల్లో 65; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ధోని (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అండర్సన్ 5, బిన్నెట్ 2 వికెట్లు తీశారు.
 
 మ్యాచ్ హైలైట్స్...
 
 1.గుప్టిల్ సెంచరీ
 కివీస్ ఓపెనర్లలో రైడర్ (12 బంతుల్లో 20; 4 ఫోర్లు) విఫలమైనా గుప్టిల్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు చేశాడు. విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించాడు. మిడిలార్డర్‌లో రోంచీ (20 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చినా... చివర్లో సౌతీ (23 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) దుమ్మురేపాడు. జట్టు స్కోరు 289/9 ఉన్న దశలో అతను ఇచ్చిన క్యాచ్‌ను భువీ మిస్ చేశాడు. తర్వాత సౌతీ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టడంతో భారీ స్కోరు వచ్చింది.
 
 2.ఓపెనర్ల శుభారంభం
 ఈ టూర్‌లో తొలిసారి భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. తొలి వికెట్‌కు ధావన్, రోహిత్ కలిసి 64 పరుగులు జోడించారు.
 
 3.ధోని పోరాటం
 భారత్ ఏడు పరుగుల వ్యవధిలో రోహిత్, కోహ్లి, రహానేల వికెట్లు కోల్పోయి... 79/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రైనా, ధోని పోరాడి ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. రైనా అవుటయ్యాక వచ్చిన అశ్విన్ నెమ్మదిగా ఆడితే.. ధోని మాత్రం వేగంగా ఆడాడు. భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ధోని అండర్సన్‌కే వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో అశ్విన్‌తో ఆరో వికెట్‌కు నెలకొన్న 38 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా 184 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది.
 
 4.టర్నింగ్ పాయింట్
 ధోని అవుటైన తర్వాత అశ్విన్ విశ్వరూపం చూపాడు. విజయానికి 84 బంతుల్లో 129 పరుగులు కావాల్సిన దశలో జడేజాతో కలిసి పరుగుల వరద పారించాడు. ఓవర్‌కో బౌండరీ చొప్పున కొట్టాడు. సౌతీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జడేజా గాడిలో పడితే... నాథన్ బౌలింగ్‌లో ఫోర్‌తో అశ్విన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు భారత్ విజయ లక్ష్యం 36 బంతుల్లో 54 పరుగులుగా మారింది. ఈ దశలో నాథన్ బౌలింగ్‌లో అశ్విన్ భారీ సిక్సర్ సంధించాడు. కానీ మరో మూడు బంతుల తర్వాత కొట్టిన అలాంటి షాట్‌ను బౌండరీ వద్ద గుప్టిల్ అద్భుతంగా అందుకోవడంతో మ్యాచ్ కివీస్ వైపు టర్న్ అయ్యింది. జడేజా, అశ్విన్ 55 బంతుల్లో 85 పరుగులు జోడించారు.
 
 5.ఆఖరి ఓవర్లో ఉత్కంఠ
 జడేజా నిలబడినా... రెండో ఎండ్‌లో భువనేశ్వర్ (4), షమీ (2) వెంటనే అవుటయ్యారు. చివరి బ్యాట్స్‌మన్‌గా ఆరోన్ (2 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. విజయానికి కివీస్‌కు ఒక్క వికెట్ అవసరమైతే.. భారత్‌కు 6 బంతుల్లో 18 పరుగులు కావాలి. టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన అండర్సన్ తొలి బంతి వేశాడు.
 
 
 జడేజా డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. రెండో బంతి వైడు. తర్వాతి బంతిని కట్ చేయబోయి విఫలమయ్యాడు. మూడో బంతిని థర్డ్‌మ్యాన్ వైపు నెట్టాడు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా తీయలేదు. ఇక చివరి 3 బంతుల్లో 13 పరుగులు చేయాలి. మళ్లీ వైడు. దీంతో భారత లక్ష్యం 12 పరుగులకు వచ్చింది.
 
 నాలుగో బంతిని జడేజా సులువుగా ఫ్లిక్ చేశాడు. అంతే బౌండరీ రోప్ దాటింది. షార్ట్ లెంగ్త్ రూపంలో వచ్చిన ఐదో బంతిని గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. దీంతో 10 పరుగులు సమకూరాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు కావాలి. జడేజా మిడాఫ్‌లోకి ఆడగా బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. సింగిల్ మాత్రమే వచ్చింది. మ్యాచ్ టైగా ముగిసింది.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) రహానే (బి) జడేజా 111; రైడర్ (బి) భువనేశ్వర్ 20; విలియమ్సన్ (బి) షమీ 65; అండర్సన్ (బి) అశ్విన్ 8; టేలర్ రనౌట్ 17; బి.మెకల్లమ్ (సి) అశ్విన్ (బి) ఆరోన్ 0; రోంచీ (సి) రహానే (బి) జడేజా 38; ఎన్.మెకల్లమ్ రనౌట్ 1; సౌతీ రనౌట్ 27; మెక్లీనగన్ (సి) జడేజా (బి) షమీ 3; బిన్నెట్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 314.
 
 వికెట్లపతనం: 1-36; 2-189; 3-198; 4-224; 5-230; 6-270; 7-280; 8-280; 9-288; 10-314. బౌలింగ్: భువనేశ్వర్ 9-0-48-1; షమీ 10-0-84-2; ఆరోన్ 7-0-52-1; జడేజా 10-0-47-2; అశ్విన్ 10-0-47-1; రైనా 4-0-26-0.
 
 భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) గుప్టిల్ (బి) అండర్సన్ 28; రోహిత్ (సి) బిన్నెట్ (బి) అండర్సన్ 39; కోహ్లి (సి) రోంచీ (బి) బిన్నెట్ 6; రహానే (సి) రోంచీ (బి) అండర్సన్ 3; రైనా (సి) రోంచీ (బి) సౌతీ 31; ధోని (సి) సౌతీ (బి) అండర్సన్ 50; అశ్విన్ (సి) గుప్టిల్ (బి) ఎన్.మెకల్లమ్ 65; జడేజా నాటౌట్ 66; భువనేశ్వర్ (సి) ఎన్.మెకల్లమ్ (బి) బిన్నెట్ 4; షమీ (సి) విలియమ్సన్ (బి) అండర్సన్ 2; ఆరోన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 314.
 
 వికెట్లపతనం: 1-64; 2-72; 3-74; 4-79; 5-146; 6-184; 7-269; 8-275; 9-286. బౌలింగ్: సౌతీ 10-0-74-1; మెక్లీనగన్ 10-0-76-0; బిన్నెట్ 10-2-41-2; అండర్సన్ 10-1-63-5; విలియమ్సన్ 2-0-17-0; ఎన్.మెకల్లమ్ 8-0-39-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement