ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్.
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు.
ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్.
న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..
Comments
Please login to add a commentAdd a comment