కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శుక్రవారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలనే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బరిలోకి దిగుతుండగా, బెంగళూరు పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పోరుకు సిద్ధమవుతుంది.
ఇదిలా ఉంచితే, చివరి మ్యాచ్‌ల్లో ఢిల్లీపై పది వికెట్లతో గెలుపొందిన మ్యాక్స్‌వెల్‌సేన.. ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్ సమరానికి మరింత చేరువ కావాలనే యోచనలో ఉంది. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అనంతరం తేరుకున్న పంజాబ్ తను ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సమష్టి విజయం సాధించింది. తొలుత పేసర్లు చెలరేగడంతో ఢిల్లీని కేవలం 67 పరుగులకు కుప్పకూల్చారు. పంజాబ్ జోరుకు టోర్నీ చరిత్రలోనే ఢిల్లీ తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్‌సేన కేవలం 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసక ప్లేయర్ మార్టన్ గప్టిల్ కేవలం 27 బంతుల్లోనే అర్ధసెంచరీ నమెదుచేయడం విశేషం. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌లాడిన పంజాబ్ నాలుగు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది.