
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టులో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు యువ క్రికెటర్ శుబ్‌మాన్ గిల్. విండీస్ సిరీస్‌కు ఎంపిక కానప్పటికీ తర్వాతి సిరీస్‌కు సెలక్టర్లు తనకు అవకాశం ఇస్తారన్న నమ్మకం ఉందన్నాడు. దేవధర్ ట్రోఫీలో భాగంగా భారత సి జట్టు తరపున ఆడుతున్న శుబ్‌మాన్ గిల్ సెంచరీతో మెరిశాడు. అనంతరం గిల్ మాట్లాడుతూ.. భారత జట్టులో అరంగేట్రం చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాడు.
న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో శుభమన్‌గిల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అద్భుతమైన శతకాలతో ఆకట్టుకున్నాడు. ట్రోఫీ గెలవడంలో పృథ్వీ షాతో కలిసి కీలక పాత్ర పోషించాడు. అయితే తన సహచర ఆటగాడు పృథ్వీ షా ఇప్పటికే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో శుబ్‌మాన్ గిల్ కూడా స్థానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
‘జాతీయ జట్టు తరపున ఆడేందుకు నేను సిద్ధం. వెస్టిండీస్‌పై నాకు అవకాశం రాలేదు. తర్వాతి సిరీస్‌లో రావొచ్చు. పరుగులు చేయడం నాకిష్టం. మైదానంలోకి వెళ్లే ముందు వరకే అంచనాలు మదిలో ఉంటాయి. ఆ తర్వాత పరుగులు చేయడం పైనే ధ్యాసంతా. ఔటైతే ఏమవుతుందని ఆలోచించను. అండర్-19 ప్రదర్శనలను సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటారని తెలుసు. ఆ తర్వాతా వరుస ప్రదర్శనలు చేస్తేనే జాతీయ జట్టుకు అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో మ్యాచ్‌లను ప్రతిరోజూ టీవీల్లో చూసే అవకాశం ఉంది. దాంతో ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో తెలుస్తోంది. మా నాన్నే నా కోచ్’ అని శుబ్‌మాన్ గిల్ గిల్ పేర్కొన్నాడు.