వాళ్లదో 'వెర్రి' : పీటర్సన్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఎయిర్ పోర్టులో తనకు చేదు అనుభవం ఎదురు కావడం పట్ల ఇంగ్లండ్ కు చెందిన మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు. బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన పీటర్సన్ కు సిడ్నీ ఎయిర్ పోర్టులో అంతకుముందు ఎన్నడూ ఎదురుకాని ఓ వింత పరిస్థితి అతన్ని తీవ్ర ఇబ్బంది పెట్టింది. ఇందుకు కారణం పీటర్సన్ ను క్వాంటాస్ ఎయిర్ లైన్ విశ్రాంతి గదిలో అనుమతించక పోవడమే. తన ఒంటిపై ప్లాస్టిక్ ను పోలిన కొన్ని వస్తువులు ఉన్న కారణంగా విశ్రాంతి గదిలోకి రానివ్వలేదని పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని ఇక్కడ తాను చూడలేదని క్వాంటాస్ ఎయిర్ సర్వీస్ ను తిట్టిపోశాడు. క్వాంటాస్ ఎయిర్ వేస్ ను 'వెర్రి' ఎయిర్ వేస్ గా పోలుస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై క్వాంటాస్ ఎయిర్ వేస్ దిగివచ్చి పీటర్సన్ కు క్షమాపణలు చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో డ్రెస్ కోడ్ నిబంధనలను కఠినతరం చేసిన కారణంగానే పీటర్సన్ పట్ల తమ సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని సర్దుచెప్పుకునే ప్రయత్నం చేసింది.