‘అధర్మవీర్’
♦ డోపింగ్‌లో దొరికిన ధరమ్‌వీర్ సింగ్
♦ అథ్లెట్ ‘ఎ’ శాంపిల్ పాజిటివ్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు మరో భారత ఆటగాడు డోపింగ్ వివాదంలో నిలిచాడు. 200 మీ. పరుగులో పాల్గొనేందుకు అర్హత సాధించిన అథ్లెట్ ధరమ్‌వీర్ సింగ్ నిషేధిక ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. అతని ‘ఎ’ శాంపిల్ నివేదిక పాజిటివ్‌గా వచ్చినట్లు, అందులో అనబాలిక్ స్టెరాయిడ్ గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారికంగా ప్రకటించలేదు. మంగళవారం రాత్రి ఇతర భారత జట్టు సభ్యులతో కలిసి ధరమ్‌వీర్ రియోకు బయల్దేరాల్సి ఉంది. కానీ అతడు జట్టుతో చేరకపోవడంతో అనుమానం తలెత్తింది. దీనిపై వివరణ ఇస్తూ ‘నాడా’ అధికారి ఒకరు అథ్లెట్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఒక ఆటగాడు పట్టుబడ్డాడనే విషయాన్ని మాత్రం నిర్ధారించారు. అతని ‘బి’ శాంపిల్ కూడా పరీక్షించాల్సి ఉంది. దాని ఫలితాలు వచ్చేందుకు కనీసం వారం రోజులు పడుతుంది కాబట్టి ఒక వేళ అందులో నెగెటివ్‌గా తేలినా... ధరమ్‌వీర్ రియో వెళ్లగలడా లేదా అనేది సందేహమే.
రెండో సారి
హరియాణాలోకి రోహ్‌టక్‌కు చెందిన ధరమ్‌వీర్ బెంగళూరులో జరిగిన జాతీయ మీట్‌లో 20.45 సెకన్లలో 200 మీ. పరుగు పూర్తి చేసి (అర్హతా ప్రమాణం 20.50 సె.) ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. 36 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే గత కొంత కాలంగా పెద్దగా రాణించలేకపోతున్న ధరమ్‌వీర్ సాధించిన టైమింగ్‌పై అప్పుడే కొంత మంది సందేహాలు వ్యక్తం చేశారు.
జాతీయ శిబిరంలో కాకుండా రోహ్‌టక్‌లో సొంత కోచ్‌తో కలిసి సాధన చేస్తుండటం అనుమానాలు పెంచింది. 2012లోనే జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీ. పరుగులో ధరమ్‌వీర్ స్వర్ణం సాధించాడు. అయితే డోపింగ్ పరీక్షలో పాల్గొనేందుకు నిరాకరించాడు. దాంతో అధికారులు అతని పతకాన్ని రద్దు చేశారు. గత రికార్డు కారణంగా ఈ సారి మళ్లీ డోపీగా తేలితే అతనిపై కనీసం ఎనిమిదేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.