ఒలింపిక్ విలేజ్ లో వరుస చోరీలు
రియోడీజనీరో: రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, ఇతర ఆటగాళ్లు వరుస చోరీ ఘటనలతో సతమతమవుతున్నారు. ఒపింపిక్ విలేజ్ లో ఏర్పాట్లు చవకబారుగా ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చోరీలు ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా డెన్మార్క్ అథ్లెట్ల మొబైల్స్, బట్టలు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డెన్మార్క్ చెఫ్ డె మిషన్ కు చెందిన రాడ్ విట్ మాట్లాడుతూ.. తన ఐపాడ్ కూడా చోరీ చేశారని ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు.
జూలై 18 నుంచి ఇప్పటివరకూ ఒలింపిక్ విలేజ్ లోని 36 అపార్ట్ మెంట్ల నుంచి దాదాపు 150 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా చైనా, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు బాధితులుగా ఉన్నారు. రియోలో 88 వేలకు పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. లండన్2012 ఒలింపిక్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువని, అయితే వరుస చోరీలతో అథ్లెట్లు భయబ్రాంతులకు లోనవుతున్నారని డెన్మార్క్ అధికారులు వివరించారు. రియో నిర్వాహకులు మాత్రం ఫిర్యాదు అందిన ప్రతిసారి బాధితులకు క్షమాపణలు చెబుతున్నారు తప్ప ఇలాంటివి జరకుండా చేయడంలో విఫలమవుతున్నారు.