ఇంకా సిద్ధం కాలేదు!
* అసంపూర్తిగా ఒలింపిక్ విలేజ్
* వారంలో సిద్ధం చేస్తామన్న నిర్వాహకులు
రియో డి జనీరో: మురుగు నీటితో నిండిపోయిన టాయిలెట్లు, లీకేజ్ పైపులు, ప్రమాదభరితంగా మారిన వైరింగ్, మెట్లపై అడుగుల మందం పేరుకుపోయిన మట్టి, ఇంకా పూర్తికానీ లైటింగ్ వ్యవస్థ, దుమ్ముపట్టిన రూమ్‌లు, ఫ్లోరింగ్, నీటితో తడిసిపోయిన గోడలు... ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం... ఒలింపిక్స్ విలేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. గేమ్స్‌కు 10 రోజుల సమయం కూడా లేదు. కానీ అక్కడ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. గేమ్స్ కోసం రియో చేరుకుంటున్న చాలా దేశాల అథ్లెట్లు... విలేజ్ పరిస్థితి చూసి అక్కడికి వెళ్లేందుకు జంకుతున్నారు.
సోమవారం ఆస్ట్రేలియా అథ్లెట్లు అపార్ట్‌మెంట్‌లో వసతులు చూసి వెనుదిరిగిపోయారు. దీంతో ఆఘామేఘాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నిర్వాహకులు వారం రోజుల్లో ఒలింపిక్ విలేజ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు 630 మంది పని చేస్తున్నారని కమిటీ అధికార ప్రతినిధి మారియో ఆండ్రెడా తెలిపారు. గురువారానికి విలేజ్‌ను అందుబాటులో తెస్తామన్నారు. రోయింగ్, సెయిలింగ్ జరిగే ప్రాంతాల్లో అధిక జనాభా కారణంగా జికా వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షల కోసం అపార్ట్‌మెంట్లలో ఓపెన్ చేసిన నల్లాలను ఆపి వేయకపోవడంతో రూమ్‌లన్నీ నీటితో నిండిపోయి విపరీతమైన దుర్గంధం, గ్యాస్ వాసన వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. మొత్తానికి తొలిసారి గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఆనందం దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌కు లేకుండా పోతోంది. అనుభవరాహిత్యం, ప్రణాళిక లోపంతో ఒకేసారి పలు రకాల సమస్యలు చుట్టుముట్టుతుండటం తలకు మించిన భారంగా మారింది.