ఒలింపిక్స్ నిర్వహణపై బ్రెజిల్లో నిరసన
సావో పాలో: బ్రెజిల్లో ఒలింపిక్ గేమ్స్ 2016 ప్రారంభవేడుకలు ఘనంగా జరగగా, మరోవైపు ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం వద్దంటూ ఆ దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకంగా సావో పాలోలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్రెజిల్ పోలీసులు కనీసం 35 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
బ్రెజిల్ వాణిజ్య కేంద్రమైన పాలిస్టా ఎవెన్యూ వద్ద శుక్రవారం 100 మంది ఆందోళనకారులు గుమికూడారు. సిటీ సెంటర్ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఒలింపిక్స్ ప్రారంభవేడుకలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.