నిద్ర కళ్లతో టీవీ చూద్దాం
బోల్ట్ పరుగు తీసే క్షణాలను చూడాలనుకుంటున్నారా..?
భారత క్రీడాకారులు సగర్వంగా పతకాన్ని ముద్దాడుతుంటే ఆనందించాలని భావిస్తున్నారా..?
అయితే నిద్రకళ్లతో టీవీ చూడటానికి సిద్ధం కండి. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడల పండగ ఒలింపిక్స్ వచ్చేసింది. శుక్రవారం రాత్రి జరిగే ప్రారంభోత్సవ (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున గం. 4.30 నుంచి) కార్యక్రమంతో అధికారికంగా క్రీడలకు తెరలేవనుంది. 17 రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్స్ ఈసారి బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో జరుగుతున్నాయి.
భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఇవి రాత్రి మొత్తం ఉంటాయి. ఉదయం ఏడు గంటల వరకూ సాగుతాయి. బోల్ట్ 100 మీటర్ల పరుగు మన కాలమానం ప్రకారం 15వ తేదీ ఉదయం గం.6.55కి ఉంటుంది.
అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండటమో... లేక తెల్లవారుజామున త్వరగా లేవడమో... అనుకూలతను బట్టి ఏదో ఒక సమయంలో నిద్ర కళ్లతో అయినా టీవీ ఆన్ చేద్దాం. పండుగను ఆస్వాదిద్దాం.