ఫ్లే ఆఫ్ లోకి రైజింగ్ పుణె
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన రసవత్తర పోరులో పుణె విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఆకట్టుకున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తొమ్మిది వికెట్లతో తేడాతో గెలిచి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ 73 పరుగులోకే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఇది ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ అత్యల్ప స్కోరుగా నమోదైంది.
పుణె బౌలర్లు శార్ధుల్ ఠాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ కుప్పకూలింది. ఇక ఆపై 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణె భారీ విజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి (28) వికెట్ కోల్పోయినా మిగతా పనిని అజింక్యా రహానే (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (15 నాటౌట్) లు పూర్తి చేశారు. దాంతో ఇంకా 8 ఓవర్లకు మిగిలి ఉండగానే పుణె విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ లోకి ప్రవేశించిన రైజింగ్ పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే.