టాప్ ఆర్డర్ విఫలం..పుణే లక్ష్యం 156
► తొలి ఓవర్ ను మేడిన్ చేసిన ఉనద్కత్
► రాణించిన మనీష్, గ్రాండ్ హోమ్, సూర్యకుమార్
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణేల మధ్య జరుగుతున్నఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా పుణే కు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రైజింగ్ పుణే కోల్ కతా బ్యాట్స్ మెన్ లను కట్టు దిట్టమైన బంతులతో ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి ఓవర్ ను మేడిన్ చేసి వికెట్ తీసిన ఉనద్కత్ ఈ సీజన్ లో తొలి ఓవర్ ను మేడిన్ చేసిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు.
దీంతో కోల్ కతా పరుగులు ఏమి చేయకుండానే వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్సన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో హిట్ వికెట్ అయి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక వైపు వికెట్లుపడుతున్న గంభీర్ దాటిగా ఆడాడు. ఈ తరుణంలో సుందర్ బౌలింగ్ లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కోట్టిన గంభీర్ మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా 3 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. ఈ సీజన్ లో పవర్ ప్లే లో కోల్ కతా నమోదు చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇది. హైదరాబాద్ మ్యాచ్ లో 40 పరుగులు చేసింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన యూసఫ్ పఠాన్ కూడా నిలదొక్కుకోలేకపోయాడు. మనీష్ పాండే, గ్రాండ్ హోమ్ తో కలిసి దాటిగా ఆడాడు. 4 ఫోర్లు ఒక సిక్సర్ తో 37 పరుగులు చేసిన మనీష్ పాండే క్రిస్టియన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ వద్ద రహానేకు చిక్కాడు. వీరిద్దరు ఐదో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆ వెంటనే గ్రాండ్ హోమ్ 36 ( 2 సిక్స్ లు, మూడు ఫోర్లు) కూడా అవుటయ్యీడు. ఉనద్కత్ వేసిన 19 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్, కౌల్టర్ నైల్ మరో సిక్స్ బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో స్టోక్స్ 1 వికెట్ తీసి నాలుగు పరుగులే ఇవ్వడంతో కోల్ కతా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది. ఇక పుణే బౌలర్ల లో ఉనద్కత్, వాషింగ్టన్ లకు చెరో రెండు వికెట్లు దక్కగా, స్టోక్స్, ఇమ్రాన్ తాహిర్, క్రిస్టియన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.