ఐపీఎల్: హిస్టరీ రిపీట్ అయింది!
ముంబై: ఐపీఎల్ లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పుణే జట్టు దాన్ని రిపీట్ చేసింది. ఐపీఎల్10 సీజన్లో తుది పోరుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేరుకుంది. ఇక్కడి వాంఖేడెలో నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై పుణే నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెగ్గితేనే ఫైనల్ చేరుతుంది. ఆపై ఈ సీజన్లో ఆడిన మూడుసార్లు తమను ఓడించిన పుణేపై ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఉంటుంది.
2017లో ఐపీఎల్-10లోనూ ఇప్పుడు అదే జరిగింది. క్వాలిఫయర్-1లో పటిష్టమైన ముంబయిని కంగు తినిపించిన స్టీవ్ స్మిత్ సేన ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో నెంబర్ వన్ గా ఉన్న జట్లు 2012, 2016 సీజన్లలో ఫైనల్ చేరలేదు. కానీ ప్రతి సీజన్లోనూ రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే.. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఫైనల్లో టాప్1, 2 జట్లు తలపడితే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న జట్టునే విజయం వరిస్తూ వచ్చింది. 2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది.
14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ లు నెగ్గి 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. గెలిచిన జట్టును క్వాలిఫయర్-2లో మట్టికరిపిస్తేనే ముంబై ఫైనల్ చేరుతుంది.
2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే..
⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై
⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్
⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై
⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్
⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై
⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్
⇒ 2017: పుణే(2) వర్సెస్ (క్వాలిఫయర్-2 విన్నర్) ?