ధోనీకి పుణె ఓనర్లకు అస్సలు పడటం లేదా?
పుణే: భారత్ క్రికెట్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ. అతని నాయకత్వంలో టీమిండియా అనేక చిరస్మరణీయ విజయాలను సాధించింది. ఒక గొప్ప క్రికెటర్‌గా ధోనీని, అతని వ్యక్తిత్వాన్ని అభిమానులు ఆరాధిస్తారు. కానీ టీమిండియా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలు కోల్పోయి.. ఇప్పుడు ఓ సాధారణ క్రికెటర్‌గా ఈ టోర్నీలో ఆడుతున్న ధోనీకి అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ (ఆర్పీఎస్) జట్టు యాజమాన్యం.. అతనిపై విమర్శలతో ట్విట్టర్‌లో దుమారం రేపుతోంది. రైజింగ్ పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఇప్పటికే ధోనీపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయినా వెనుకకు తగ్గని హర్ష్ తాజాగా మరోసారి మరోసారి ధోనీపై విమర్శలు గుప్పించారు.
మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పుణె విజయం సాధించడంతో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు గుప్పించిన హర్ష్.. అంతటితో ఆగకుండా ధోనితో పోలిక తెచ్చారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ ట్వీట్ చేశారు. ఆయన దురుసు విమర్శలపై ట్విట్టర్‌లో తీవ్ర దుమారం రేగింది. ఆయనపై ధోనీ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
పుణె జట్టు తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చేతిలో ఓడిపోవడంతో హర్ష్ గోయెంకా మరోసారి ధోనీని టార్గెట్ చేశారు. పుణె ఆటగాళ్ల స్ట్రైక్ రేట్స్‌తో కూడిన స్క్రీన్ షాట్లను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఆర్పీఎస్ బ్యాటింగ్ స్టాటిస్టిక్స్ ఇవి.. మనోజ్ తివారి, రహానే, క్రిస్టియన్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ను సాధించారు’ అని కామెంట్ చేశారు. ఈ లిస్ట్‌లో 73.91 స్ట్రైక్ రేటుతో ధోనీ నాలుగోస్థానంలో ఉండగా.. ఒకే మ్యాచ్ ఆడి 17 పరుగులు చేసిన క్రిస్టియన్ 212.50 స్ట్రైక్ రేటుతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ట్వీట్ ద్వారా గడిచిన రెండు మ్యాచ్‌లలో ధోనీ సరిగ్గా ఆడలేదనే విషయాన్ని పరోక్షంగా హర్ష్ గోయెంకా విమర్శించడంపై మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. ధోనీని ఇలా బాహాటంగా విమర్శించడమేమిటని ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. మొత్తానికి పుణె జట్టు యాజమాన్యం తీరు చూస్తుంటే.. ధోనీకి వారికి అస్సలు పడటం లేదని, అందుకే అయినదానికీ, కానిదానికీ ఇలా విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
#RPS batting statistics until now - Manoj Tiwari, Rahane , Christian have the best strike rates. pic.twitter.com/JKya3lxHKC
— Harsh Goenka (@hvgoenka) 8 April 2017