ధోనిపై గోయెంకా పరుష వ్యాఖ్యలు
విరుచుకుపడ్డ అభిమానులు
పుణే: ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించినా రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు యాజమాన్యం అతనిపై తమ అసంతృప్తిని దాచుకోలేకపోతున్నట్లుంది. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా చేసిన తాజా వ్యాఖ్యలు దానిని నిరూపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌పై విజయం తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు కురిపించిన హర్ష్ అంతటితో ఆగకుండా ధోనితో పోలిక తెచ్చారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ ట్వీట్ చేశారు.
కొద్దిసేపట్లోనే ఈ ట్వీట్ వైరల్ కాగా, అభిమానులు పెద్ద ఎత్తున గోయెంకాపై విరుచుకుపడ్డారు. అసలు బహిరంగంగా ధోనిని విమర్శించడం ఏమిటని వారంతా తిట్టి పోశారు. ‘ఆసీస్ ఆటగాళ్లతో పోల్చి ధోనిని అవమానిస్తున్నందుకు సిగ్గు పడాలి’... ‘ధోని వల్లే నీ జట్టును అభిమానిస్తున్నారనే విషయం మరచిపోవద్దు’... ‘స్మిత్ కోసమో, స్టోక్స్ కోసమో, దిండా కోసమో పుణే వాళ్లు మ్యాచ్‌లు చూడటం లేదు, అంతా వచ్చింది ధోని కోసమే’... ‘స్మిత్ బాగా ఆడి ఉండవచ్చు కానీ ఒక దిగ్గజాన్ని ఎలా గౌరవించాలో ముందు నేర్చుకో’... ఇలా అన్ని వైపుల నుంచి హర్ష్ గోయెంకాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దిగి వచ్చిన హర్‡్ష, తన మొదటి ట్వీట్‌ను తొలగించి ధోని స్టార్ అనే విషయాన్ని అంగీకరిస్తున్నానని, తనతో పాటు అందరికీ అతను హీరో అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.