ధోనీకి మందలింపు
►అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే..
►చర్చనీయాంశంగా మిస్టర్ కూల్ అప్పీల్
పుణె: సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీకి మంచి పేరు ఉంది. వ్యూహాలను అమలు చేయడంలో, ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో దిట్ట అన్న పేరు ఉంది. తాను నాయకత్వం వహించిన మ్యాచ్‌ల్లో వూహించని నిర్ణయాలు తీసుకొని చాలాసార్లు ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ముంబయి ఇండియన్స్ జట్టుతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తలపడింది. తన ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ తొలిసారి సారథిగా కాకుండా ఓ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ తాను కెప్టెన్ కాదు అన్న సంగతి మరచిపోయి అతడు వ్యవహరించిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
అసలు ఏం జరిగింది?
అంతర్జాతీయ క్రికెట్‌ల్లో ప్రస్తుతం టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రమే ‘డీఆర్‌ఎస్’ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రం సమీక్ష కోరే పద్ధతి అందుబాటులో లేదు. ఐతే ముంబయి ఇండియన్స్ జట్టు 115/5 ఉన్న సమయంలో పుణె స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 15వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. ముంబయి బ్యాట్స్‌మన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తాహిర్ వేసిన బంతి పొలార్డ్ ప్యాడ్‌లకు తాకడంతో అతడు ఔట్ కోసం అంపైర్‌ను అప్పీల్ కోరాడు. కీపింగ్ చేస్తున్న ధోని సైతం గట్టిగానే అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. ధోనీ వెంటనే సమీక్ష కోరాడు. ఐతే ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్ లేకపోయినప్పటికీ పరోక్షంగా అంపైర్ నిర్ణయాన్ని అసహనంతో వ్యంగ్యంగా సంజ్ఞ రూపంలో తెలియజేశాడు. ఈ పరిణామంతో తోటిఆటగాళ్లు, మ్యాచ్ చూస్తోన్న ప్రేక్షకులు విస్తుపోయారు. అదేంటి? ధోనీ ఇలా చేశాడు. ఎప్పుడూ నిలకడగా కనిపించే ధోనీ.. ఇలా నిరసన ప్రదర్శించడంపై చర్చానీయాంశమైంది. కేవలం అంపైర్ తమ నిర్ణయాన్ని వ్యతిరేకించాడన్న కారణంతో ఇలాంటి వ్యంగ్య సైగలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మహీకి.. మందలింపు
చివరికి అనుకున్నదంతా అయింది. అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోని వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. అతని ప్రవర్తనా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో లెవల్–1 నిబంధనల ప్రకారం అతన్ని తీవ్రంగా మందలించారు. నియమావళిలో లెవల్–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధోనీ తాను కెప్టెన్ అన్న సంగతి మరిచి ఇలా చేశాడో.. కావాలనే చేశాడో అన్న విషయం అర్థం కావడం లేదు. సాధారణ జట్టు సభ్యుడిగా ధోనీకి ఇది తొలిమ్యాచ్ కావడం వల్ల.. పాత అలవాటు ప్రకారం అలా చేసి ఉంటాడని చాలామంది ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు.