కోహ్లి తీవ్ర అసంతృప్తి
బెంగళూరు: సొంత మైదానంలో ఓడిపోవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో తమ టీమ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం శోచనీయమని వాపోయాడు. ఇలా ఆడితే విజయానికి తాము అర్హులం కాదని కుండబద్దలు కొట్టాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ... ‘ఈ ఉద్వేగాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. ఇలా ఆడితే విజయానికి మేము అర్హులం కాదు. నిజాయితీగా చెప్పాలంటే గత మ్యాచ్ చాలా బాగా ఆడాం. కానీ ఈరోజు మ్యాచ్ లో బాగా ఆడలేకపోయాం. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మేము నిలకడగా, బాగా ఆడాల్సిన అవసరముంది. పుణె టీమ్ మాకంటే బాగా ఆడి గెలిచింద’ని అన్నాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడాన్ని అతడు తప్పుబట్టాడు. ఆర్సీబీ బౌలర్లు మరింత మెరుడుపడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. గతేడాది బాగా ఆడామని ప్రతిసారి అదేవిధంగా ఆడడం సాధ్యంకాదన్నాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని పుణె 27 పరుగుల తేడాతో ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్ టీమ్ బెంగళూరును ఓడించడం మరో విశేషం.