బోణీ కొట్టేదెవరో..!
⇒ఉత్సాహంలో సన్‌రైజర్స్
⇒గాయాలతో సతమవుతున్న రాయల్ చాలెంజర్స్
⇒నేడు ఐపీఎల్ –10 ప్రారంభం
⇒హైదరాబాద్‌లో తొలిమ్యాచ్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రారంభవేడుకలు జరుగునున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, గతేడాది రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పదో సీజన్ ప్రారంభం కానుంది.బెంగళూరు జట్టును గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా లీగ్ తొలి దశ మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుకు పెద్దదెబ్బ. మరో స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ప్రారంభమ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో షేన్ వాట్సన్ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. మరోవైపు కోహ్లి స్థానంలో బరిలోకి దిగుతాడనుకున్న యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ గాయంతో సీజన్‌కే దూరమయ్యాడు.
బెంగళూరు ఆశలన్ని విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌పైనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆసీస్ టీ20 స్టార్ ట్రావిస్ హెడ్, దేశవాళీ స్టార్లు కేదార్ జాదావ్, సచిన్ బేబీ, మన్‌దీప్ సింగ్‌పైన ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో ఇంగ్లిష్ పేసర్ తైమల్ మిల్స్, యజ్వేంద్ర చహల్, శామ్యూల్ బద్రీ, కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగి రాణించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.గతేడాది అంచనాలకు మించి రాణించిన సన్‌రైజర్స్.. ఏకంగా టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈసారి అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. జట్టు ఆశలన్నీ ఆసీస్ ప్లేయర్, సారథి డేవిడ్ వార్నర్‌పైనే ఉన్నాయి. ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైనా చివరి మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చాడు. భారత ప్లేయర్ శిఖర్ ధావన్‌తో కలసి తను ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇటీవల దేవ్‌ధర్ ట్రోఫీలో ధావన్ పరుగుల వరద పారించాడు.
మరోవైపు భారత డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాలని సన్‌రైజర్స్ ఆశిస్తోంది. అయితే మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులలోటు స్పష్టంగా కన్పిస్తోంది. కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్, మోసెస్ హెన్రిక్స్, నమన్ ఓజా, దీపక్ హూడా, విజయ్ శంకర్‌లతో బ్యాటింగ్ లైనప్ ఫర్వాలేదనిపిస్తోంది. మరోవైపు రైజర్స్ బౌలింగ్ విభాగం ఐపీఎల్‌లోని అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ సంచనలం ముస్తాఫిజుర్ రహ్మాన్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్, బరీందర్ శరణ్, ఆఫ్గాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. ఓవైపు గతేడాది ఫైనల్లో తమకెదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తుండగా..సొంతగడ్డపై జరుగుతున్న తొలిమ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేయాలని సన్‌రైజర్స్ ఆశపడుతోంది. దీంతో ఈమ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
జట్లు (అంచనా)
సన్‌రైజర్స్: వార్నర్ (కెప్టెన్), ధావన్, హెన్రిక్స్, విలియమ్సన్, యువరాజ్, హూడా, తన్మయ్, ఓజా, నెహ్రా, జోర్డాన్/రషీద్, భువనేశ్వర్.
బెంగళూరు: వాట్సన్ (కెప్టెన్), గేల్, జాదవ్, సచిన్, బిన్నీ, హెడ్, చహల్, బద్రీ/మిల్నే, మన్‌దీప్, శ్రీనాథ్, అనకేత్.
⇒ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ & రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
⇒వేదిక: హైదరాబాద్, రాత్రి 8 గం.ల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్షప్రసారం