కోహ్లికి వార్నర్ వార్నింగ్!
సమర్థమైన గేమ్ ప్లాన్‌తో ఫైనల్‌కు సిద్ధమవుతున్నామని వ్యాఖ్య
జట్టు సారథిగా డేవిడ్ వార్నర్ సత్తా చాటాడు. ఆసాంతం నిలకడగా ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ.. శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ సారథి విశ్వరూపం చూపాడు. వార్నర్ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో గుజరాత్ విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఛేదించింది. చివర్లో బిపుల్ శర్మ (27 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఘనంగా హైదరాబాద్ ఫైనల్ లో అడుగుపెట్టింది.
దీంతో దీటైన సారథుల నేతృత్వంలోని హైదరాబాద్-బెంగళూరు జట్ల మధ్య తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఇటు డేవిడ్ వార్నర్, అటు విరాట్ కోహ్లి ఇద్దరూ భీకరమైన ఫామ్‌తో విజృంభిస్తుండటంతో ఫైనల్ రసవత్తరంగా జరుగుతుందని క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి సేనను నిలువరించడానికి తాము సమర్థవంతమైన గేమ్ ప్లాన్‌తో సిద్ధమవుతామని హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ అన్నాడు. మ్యాచ్ తర్వాత అతను విలేకరులతో మాట్లాడాడు.
ఫైనల్‌లో కోహ్లిపైనే టార్గెట్!
'బెంగళూరుతో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో చాలా బాగా పుంజుకున్నాం. విరాట్ కోహ్లి నిజానికి అద్భుతమైన ఆటగాడు. మేం అతన్ని తర్వగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లి విఫలమైనా డివిలీయర్స్ ఉండనే ఉంటాడు. కాబట్టి మేం వాళ్ల జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి పెద్దగా చింతించడం లేదు. వారిని నిలువరించాలంటే సమర్థమైన గేమ్ ప్లాన్ కావాలి. దానిని మేం సిద్ధం చేసుకుంటాం' అని వార్నర్ అన్నాడు.
ఈ విజయం క్రెడిట్ నాది కాదు!
'మ్యాచ్ ఆసాంతం భాగస్వామ్యాలు కొనసాగేలా చూశాను. మాలో ఏ ఒక్కరూ క్రీజులో ఉన్నా.. మేం గెలుస్తామని భావించాను. ఎందుకంటే మంచి బ్యాటింగ్ పిచ్. ఈ (విజయం) క్రెడిట్‌ను నేను తీసుకోను. మేం అందరం శాయశక్తులా కృషి చేసి మా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉంది. ఇక బిపుల్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సత్తా చాటాడు' అని వార్నర్ పేర్కొన్నాడు.