
ముంబైపై పుణె సూపర్ విజయం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో తమ తొలి మ్యాచ్ లోనే మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని పుణె సూపర్ గియంట్స్ ఘనవిజయాన్ని సాధించింది. ఈ సీజన్ లో భాగంగా శనివారం ఇక్కడ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ని పుణె మట్టికరిపించింది. పుణె ఓపెనర్లు అజింక్య రహానే(66 పరుగులు: 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (34 పరుగులు: 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) గట్టి పునాది వేశారు. 78 పరుగుల వద్ద పుణె తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెవిన్ పీటర్సన్(21 నాటౌట్) తో కలిసి రహానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.
తడబడిన ముంబై ఇండియన్స్:
ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(7), లెండిల్ సిమ్మన్స్(8) వికెట్లను కోల్పోయి తడబడింది. ఆ తరువాత 51 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ముంబై ఆటగాళ్లలో హర్దిక్ పాండ్యా(9), బట్లర్(0), పొలార్డ్(1), ఎస్ గోపాల్(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో అంబటి రాయుడు(22), హర్భజన్ సింగ్(45 నాటౌట్; 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)ల జోడి ముంబై ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టింది.కాగా, జట్టు స్కోరు 68 పరుగుల వద్ద రాయుడు ఏడో వికెట్ గా పెవిలియన్ చేరినా.. హర్భజన్ సింగ్ బ్యాట్ తో మెరవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 121 పరుగులు నమోదు చేసింది. పుణె బౌలర్లలో ఇషాంత్ శర్మ, మిచెల్ మార్ష్లు తలో రెండు వికెట్లు సాధించగా,ఆర్పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, భాటియాలకు ఒక్కో వికెట్ దక్కింది.