
ధోని వర్సెస్ రోహిత్
టీ 20 ప్రపంచకప్ ను ఆస్వాదించిన క్షణాలు ఇంకా మనముందు కదలాడుతుండగానే మరో క్రికెట్ సమరానికి వేళయింది.
ముంబై:టీ 20 ప్రపంచకప్ ను ఆస్వాదించిన క్షణాలు ఇంకా మనముందు కదలాడుతుండగానే మరో క్రికెట్ సమరానికి వేళయింది. క్రికెట్ ప్రేమికుల్లో మరింత జోష్ ను నింపేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పండుగ వచ్చేసింది. ఐపీఎల్ -9 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి గం. 8.00 ని.లకు వాంఖేడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, పుణెకు ధోని సారథిగా ఉన్నాడు. సొంత గడ్డపై జరిగే మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా, ధోని సేన కూడా ఈ మ్యాచ్లో నెగ్గి పైచేయి సాధించాలని యోచిస్తోంది.
ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ, అంబటి రాయుడు, కోరే అండర్సన్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, సిమ్మన్స్ వంటి హార్డ్ హిట్టర్లు ఉండగా, పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వాంఖేడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ పరుగులు నమోదుకు ఆస్కారం ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. టాస్ కూడా కీలకంగా మారనుంది. వర్షం పడే అవకాశం లేదు.
జట్లు అంచనా:
ముంబై ఇండియన్స్; రోహిత్ శర్మ(కెప్టెన్), ఉన్ముక్ చంద్, సిమ్మన్స్, అంబటి రాయుడు, బట్లర్, పొలార్డ్, హర్భజన్ సింగ్, పాండ్యా, బూమ్రా, మెక్లాన్గన్, టిమ్ సౌతీ
పుణె సూపర్ జెయింట్:ధోని(కెప్టెన్), పీటర్సన్, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్, రహానే, మిచెల్ మార్ష్, సౌరభ్ తివారీ, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ, ఈశ్వర్ పాండే