గుజరాత్ లక్ష్యం 164
రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పుణె జట్టులో డు ప్లెసిస్ (69;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పీటర్సన్(37;31 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), మహేంద్ర సింగ్ ధోని(22 నాటౌట్;10 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పుణె ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, డు ప్లెసిస్లు దాటిగా ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రహానే(21) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం డు ప్లెసిస్-కెవిన్ పీటర్సన్ల జంట స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించింది. ఈ జోడి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 12.0 ఓవర్లు ముగిసే సరికి పుణె వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. కాగా, పీటర్సన్, డు ప్లెసిస్లు 19 పరుగుల వ్యవధిలో నిష్క్రమించిన తరువాత స్టీవ్ స్మిత్(5), మిచెల్ మార్ష్(7) లు నిరాశపరచడంతో పుణె స్కోరు మందగించింది. ఇక చివర్లో ధోని బ్యాట్ ఝుళిపించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. గుజరాత్ లయన్స్ బౌలర్లలో తాండే, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి.