ధోని వర్సెస్ రైనా
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో మరో ఆసక్తికర సమరానికి కాసేపట్లో తెరలేవనుంది. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని పుణె సూపర్ జెయింట్స్, సురేష్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ జట్లు పోరుకు సన్నద్ధమయ్యాయ. గురువారం రాత్రి గం.8.00 లకు ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు తమ తమ తొలి మ్యాచ్ల్లో గెలిచి మంచి జోరు మీద ఉన్నాయి.
అయితే గతేడాది వరకూ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన ధోని, రైనాలు ఇప్పుడు వేరు జట్లకు కెప్టెన్లగా వ్యవహరిస్తూ పోరుకు సిద్ధం కావడంతో పైచేయి ఎవరు సాధిస్తారనేదిపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిచి మరో అడుగు ముందుకేయాలని కొత్త జట్లు రెండూ తమ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని దాదాపు సగం ఆటగాళ్లు ఈసారి గుజరాత్ లయన్స్ లో ఉండటంతో ఆ జట్టుకు అదనపు బలం కాగా, సురేష్ రైనా కంటే ధోనికి కెప్టెన్సీ అనుభవం ఎక్కువ ఉండటం పుణెకు కలిసొచ్చే అంశం. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తవరంగా సాగే అవకాశం ఉంది.
ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో గెలుపుపై ఎవరికే వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండగా, గుజరాత్ లయన్స్ జట్టులో రైనాతో పాటు బ్రెండెన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేష్ కార్తీక్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా ,ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రాజ్ కోట్ పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎటువంటి వర్ష సూచన లేదు. ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది.
జట్లు అంచనా
పుణె సూపర్ జెయింట్స్:
ఎంఎస్ ధోని(కెప్టెన్), అజింక్యా రహానే, డు ప్లెసిస్, కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, భాటియా, మిచెల్ మార్ష్,రవి చంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ,మురుగన్ అశ్విన్, ఆర్పీ సింగ్
గుజరాత్ లయన్స్:
సురేష్ రైనా(కెప్టెన్), ఆరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రేవో, ఫాల్కనర్, ప్రవీణ్ కుమార్, లడ్డా, సంగ్వాన్