'ఆ వార్త విని షాక్ అయ్యాను'
న్యూఢిల్లీ: భారత మహిళ హాకీ జట్టు నుంచి తనను తప్పించడంపై రీతూ రాణి ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఎందుకు జట్టులోంచి తీసేసారో చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకుంది. చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియో ఒలింపిక్స్ కు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు.
'ఈ వార్త విని షాకయ్యాను. ఫిట్నెస్, ప్రవర్తన సమస్యలు లేవు. ట్రైనింగ్, క్యాంపులకు నేను గైర్హాజరు కాలేదు. క్యాంపుకు బ్రేక్ ఇచ్చినప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది. జట్టులోంచి తీసేయడంతో నన్ను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి చాలా బాధ పడ్డాడు. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న పురుషుల హాకీ జట్టు ప్లేయర్ సర్దార్ సింగ్ ను కెప్టెన్ పదవి నుంచి తీసేసినా, టీమ్ లో ఉంచారు. నన్ను మాత్రం ఏకంగా జట్టులోంచి తొలగించారు. నాకు ఈవిధంగా ఎందుకు చేశార'ని రీతూ రాణి ప్రశ్నించింది.
తనపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొంది. ఒలింపిక్స్ మ్యాచ్ లను టీవీలో చూడాల్సిన పరిస్థితి తనకు వస్తుందని ఊహించలేదని వాపోయింది.