ఏం మాయ చేశాడో...
ఫెడరర్ అద్వితీయ పునరాగమనం
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ హస్తగతం
ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి నాదల్‌పై అద్భుత విజయం
కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం
రూ. 19 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
కలయా... నిజమా..! ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్నా... గతంలో ‘గ్రాండ్’ ఫైనల్స్‌లో తనకెంతో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ప్రత్యర్థి ఫైనల్లో ఎదురైనా... పట్టుదల, పోరాటపటిమ, ఎలాగైనా గెలవాలనే బలీయమైన కాంక్ష ఉంటే... వయస్సుతో నిమిత్తం లేకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా సాధించవచ్చని స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి నిరూపించాడు. ఎవరూ ఊహించని విధంగా సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెడరర్ విజేతగా నిలిచాడు. గత అనుభవం వృథా కాదని నిరూపిస్తూ 35 ఏళ్ల వయస్సులో ఈ స్విస్ స్టార్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
మెల్‌బోర్న్: తన పనైపోయిందని భావించిన వారందరికీ రోజర్ ఫెడరర్ దిమ్మదిరిగేరీతిలో సమాధానం ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకొని 35 ఏళ్లు దాటినా... తనలో ఇంకా ఏమాత్రం చేవ తగ్గలేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 17వ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–4, 3–6, 6–1, 3–6, 6–3తో తొమ్మిదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించాడు. ఫెడరర్ కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కాగా... ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఐదోది కావడం విశేషం. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 37 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 కోట్ల 3 లక్షల 68 వేలు)... రన్నరప్ నాదల్‌కు 18 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 కోట్ల 51 లక్షలు) లభించింది.
హోరాహోరీ...
2011 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ తర్వాత ఫెడరర్, నాదల్ ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఎదురెదురుగా తలపడటం ఇదే తొలిసారి. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ అంతిమ సమరంలో ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. ఒకసారి ఫెడరర్ పైచేయి సాధిస్తే... మరోసారి నాదల్ తన ఆధిపత్యం ప్రదర్శించాడు. సుదీర్ఘ ర్యాలీలు, కళ్లు చెదిరే ఫినిషింగ్ షాట్‌లతో ఈ మ్యాచ్ ఆద్యంతం అభిమానులకు కనువిందు చేసింది.
ఉత్కంఠ క్షణాలు...
ఇద్దరూ చెరో రెండు సెట్‌లు గెలిచాక మ్యాచ్ నిర్ణాయక ఐదో సెట్‌కు వెళ్లింది. ఈ సెట్‌లోని తొలి గేమ్‌లోనే ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్‌ను కాపాడుకొని 2–0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో నాదల్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. మ్యాచ్‌లో మిగిలిన తన సర్వీస్‌లను నిలబెట్టుకుంటే నాదల్‌కు విజయం ఖాయమయ్యేది. కానీ ఫెడరర్ పట్టు విడువలేదు. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఆరో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని, ఎనిమిదో గేమ్‌లో మళ్లీ నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–3తో విజయానికి చేరువయ్యాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌లో 15–40తో వెనుకబడ్డ ఫెడరర్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 40–40తో డ్యూస్ చేశాడు. రెండుసార్లు నాదల్ మ్యాచ్ పాయింట్ కాచుకున్నా మూడోప్రయత్నంలో ఫెడరర్ ఫోర్‌హ్యాండ్ విన్నర్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫెడరర్ కొట్టిన షాట్ బయటకు వెళ్లిందని భావించిన నాదల్ రివ్యూకు వెళ్లాడు. కానీ ఫెడరర్ షాట్ సరిగ్గా తేలడంతో ఈ స్విస్ స్టార్ విజయానందంతో ఎగిరి గంతేశాడు.
ఫెడరర్ ‘గ్రాండ్’ టైటిల్స్ (18)
ఆస్ట్రేలియన్ ఓపెన్ (5): 2004, 2006, 2007, 2010, 2017
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009
వింబుల్డన్ (7): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008
విశేషాలు...
► 2007 వింబుల్డన్ ఫైనల్లో రాఫెల్ నాదల్‌పై గెలిచిన తర్వాత మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఈ స్పెయిన్ స్టార్‌ను ఫెడరర్ ఓడించడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా నాదల్‌తో తలపడిన తొమ్మిది గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఫెడరర్‌కిది మూడో విజయం.
► 2012 వింబుల్డన్ ట్రోఫీ తర్వాత ఫెడరర్ ఖాతాలో చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ ఇదే.
►ఆరేళ్ల తర్వాత (చివరిసారి 2010లో) ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుపొందడం విశేషం. ఈ టోర్నీలో అతను ఆరుసార్లు ఫైనల్‌కు చేరగా... ఐదుసార్లు విజేతగా నిలిచాడు. 2009 ఫైనల్లో నాదల్ చేతిలో ఫెడరర్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.
► ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఐదు సెట్‌లు ఆడిన తొలి ప్లేయర్ ఫెడరర్. గతంలో బోర్గ్ (స్వీడన్), టిల్డెన్ (అమెరికా) ఆరుసార్లు ఇలా ఆడారు.
►మూడు వేర్వేరు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ టైటిల్స్‌ను ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్ ఫెడరర్.
కెన్ రోజ్‌వెల్ (1971లో ఆస్ట్రేలియన్ ఓపెన్–38 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (35 ఏళ్ల 174 రోజులు) గుర్తింపు పొందాడు.
► మాట్స్ విలాండర్ (స్వీడన్–1982లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్–10 ర్యాంక్‌లోని ముగ్గురు క్రీడాకారులను ఓడించి టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా ఫెడరర్ ఘనత సాధించాడు.
► గాస్టన్ గాడియో (అర్జెంటీనా–2004లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఐదు సెట్‌ల పాటు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడిగా ఈ స్విస్ స్టార్ నిలిచాడు.
►రాయ్ ఎమర్సన్, నొవాక్ జొకోవిచ్ (6 సార్లు చొప్పున) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన రెండో ప్లేయర్‌గా ఫెడరర్ గుర్తింపు పొందాడు.
►థామస్ జొహాన్సన్ (స్వీడన్–2002లో; ర్యాంక్ 18) తర్వాత తక్కువ ర్యాంక్ (17వ ర్యాంక్)తో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ప్లేయర్ ఫెడరర్ కావడం విశేషం.
►ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో తొమ్మిదో సీడ్ ప్లేయర్‌కు ఇప్పటి వరకు టైటిల్ లభించలేదు. గతంలో తొమ్మిదో సీడ్‌తో బరిలోకి దిగిన ఏడుగురు ఆటగాళ్లు రన్నరప్‌గానే నిలువడం గమనార్హం.
మాట్లాడటానికి నా వద్ద పదాలు లేవు. పునరాగమనం ఘనంగా చేసినందుకు నాదల్‌కు అభినందనలు. నాలుగైదు నెలల క్రితం నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లాను. ఆ సమయంలో నాతోపాటు నాదల్ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు వస్తాడని ఊహించలేదనే చెప్పాలి. అయితే మేమిద్దరం ట్రోఫీలతో ఇక్కడ నిలిచున్నాం. నాదల్ సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నా. అతని చేతిలో ఓడిపోయినా సంతోషించేవాడిని. నాదల్ నిరంతరం ఇలాగే ఆడాలి. టెన్నిస్ క్రీడకు అతనెంతో అవసరం. మళ్లీ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడానికి నాతోపాటు నా సహాయక సిబ్బంది ఎంతో శ్రమించింది. వచ్చే ఏడాది మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు వస్తా. అందరికీ ధన్యవాదాలు. – రోజర్ ఫెడరర్