ఫెడరర్...కాచుకో! | Rafael Nadal sets up Roger Federer Australian Open final | Sakshi
Sakshi News home page

ఫెడరర్...కాచుకో!

Published Sat, Jan 28 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

ఫెడరర్...కాచుకో!

ఫెడరర్...కాచుకో!

ఆస్ట్రేలియన్  ఓపెన్  ఫైనల్లో నాదల్‌ సెమీస్‌లో దిమిత్రోవ్‌పై ఐదు సెట్‌ల పోరులో గెలుపురేపు ‘స్విస్‌ స్టార్‌’తో టైటిల్‌ సమరం

రెండు వారాల క్రితం ఆస్ట్రేలియన్  ఓపెన్  ప్రారంభానికి ముందు టెన్నిస్‌ పండితులు కూడా రాఫెల్‌ నాదల్, రోజర్‌ ఫెడరర్‌ ఫైనల్లోకి వస్తారని ఊహించలేకపోయారు. గాయాల బారిన పడటం... ఫామ్‌ కోల్పో వడం... జొకోవిచ్, ఆండీ ముర్రే, వావ్రింకాలతోపాటు ఇతర యువ ఆటగాళ్లు జోరు మీద ఉండటం... తదితర కారణాలతో కొంతకాలంగా వీరిద్దరూ అంతర్జాతీయ సర్క్యూట్‌లో వెనుకబడిపోయారు. దాంతో సీజన్  తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఈ ఇద్దరినీ ఎవరూ ఫేవరెట్స్‌గా పరిగణించలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ... అనుభవమే పెట్టుబడిగా... ఆత్మవిశ్వసమే ఆసరాగా ఫెడరర్‌ ఒక్కో అడ్డంకిని అధిగమించి ఫైనల్‌కు చేరుకోగా... ‘నీవెంటే నేనున్నాను... కాచుకో ఫెడరర్‌’ అంటూ నాదల్‌ కూడా ఈ స్విస్‌ స్టార్‌ జత చేరాడు. ఫలితంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య చిరస్మరణీయ అంతిమ సమరానికి ఈ ఆదివారం మెల్‌బోర్న్‌ వేదిక కానుంది.  

నేటి ఫైనల్‌
మధ్యాహ్నం గం. 2.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


మెల్‌బోర్న్‌: ఆద్యంతం పట్టు వదలకుండా పోరాడిన స్పెయిన్ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో సెమీఫైనల్లో తొమ్మిదో సీడ్‌ నాదల్‌ 4 గంటల 56 నిమిషాల్లో 6–3, 5–7, 7–6 (7/5), 6–7 (4/7), 6–4తో 15వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై కష్టపడి గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 17వ సీడ్, మాజీ చాంపియన్  రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)తో నాదల్‌ అమీతుమీ తేల్చుకుంటాడు.

కెరీర్‌లో రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీఫైనల్‌ ఆడుతున్న దిమిత్రోవ్‌ బేస్‌లైన్  ఆటతో నాదల్‌కు దీటైన పోటీ ఇచ్చాడు. తొలి సెట్‌లో ఒకసారి దిమిత్రోవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ ఈ సెట్‌ను వశం చేసుకున్నాడు. రెండో సెట్‌లో దిమిత్రోవ్‌ తేరుకున్నాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయినా... మూడుసార్లు నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఈ సెట్‌ను అతను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్‌ పైచేయి సాధించాడు. ఇక నాలుగో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో మళ్లీ టైబ్రేక్‌ తప్పలేదు. ఈసారి దిమిత్రోవ్‌ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు.

నిర్ణాయక ఐదో సెట్‌లో ఇద్దరూ తమ తొలి నాలుగు గేమ్‌లను నిలబెట్టుకోవంతో స్కోరు 4–4తో సమమైంది. అయితే తొమ్మిదో గేమ్‌లో దిమిత్రోవ్‌ సర్వీస్‌ను నాదల్‌ బ్రేక్‌ చేసి 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పదో గేమ్‌లో నాదల్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకొని ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో నాదల్‌ ఎనిమిది ఏస్‌లు సంధించి, 43 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 29 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు దిమిత్రోవ్‌ 20 ఏస్‌లు సంధించినా... ఏకంగా 79 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి...
ఫెడరర్‌తో 35వసారి తలపడనున్న నాదల్‌ టైటిల్‌ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఓవరాల్‌ ముఖాముఖి రికార్డులో నాదల్‌ 23–11తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. 2011 ఫ్రెంచ్‌ ఓపెన్  టోర్నమెంట్‌ తర్వాత వీరిద్దరూ ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో తలపడనుండటం ఇదే తొలిసారి. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల ముఖాముఖి రికార్డులోనూ నాదల్‌ 9–2తో ఆధిక్యంలో ఉన్నాడు. గతంలో ఆస్ట్రేలియన్  ఓపెన్ లో వీరిద్దరూ మూడుసార్లు తలపడగా... మూడుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌లో నాదల్‌ను ఓడించి ఫెడరర్‌కు ఏడేళ్లయింది. చివరిసారి 2007 వింబుల్డన్  ఫైనల్లో ఐదు సెట్‌ల పోరులో నాదల్‌పై ఫెడరర్‌ గెలిచాడు. ఆ తర్వాత నాదల్‌తో ఆడిన అన్ని గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ల్లో ఫెడరర్‌కు పరాజయాలే ఎదురయ్యాయి.

ముఖాముఖి రికార్డులో ఫెడరర్‌పై నేను ఆధిక్యంలో ఉన్నా అదంతా గతం. ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చాలాకాలం తర్వాత ఇద్దరం గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరుకున్నాం కాబట్టి ఈ టైటిల్‌ పోరు ప్రత్యేకంగా నిలువనుంది. గత ఫలితాలను ఆలోచించకుండా ఫైనల్లో మెరుగ్గా ఆడిన వారికే టైటిల్‌ దక్కుతుంది.

బెథానీ–సఫరోవా జంటకు డబుల్స్‌ టైటిల్‌
మహిళల డబుల్స్‌ విభాగంలో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)–లూసీ సఫరోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో బెథానీ–సఫరోవా ద్వయం 6–7 (4/7), 6–3, 6–3తో ఆండ్రియా హలవకోవా (చెక్‌ రిపబ్లిక్‌)–షుయె పెంగ్‌ (చైనా) జంటపై గెలిచింది. జంటగా బెథానీ–సఫరోవాకిది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఈ జోడీ గతేడాది యూఎస్‌ ఓపెన్ , 2015లో ఆస్ట్రేలియన్  ఓపెన్ , ఫ్రెంచ్‌ ఓపెన్  టైటిల్స్‌ సాధించింది.

ఎవరు నెగ్గినా చరిత్రే...
మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం ‘విలియమ్స్‌ సిస్టర్స్‌’ వీనస్, సెరెనా నేడు తలపడనున్నారు. సెరెనా గెలిస్తే... ఓపెన్  శకంలో (1968 తర్వాత) అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. దాంతోపాటు మళ్లీ నంబర్‌వన్  ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. వీనస్‌ గెలిస్తే... ఓపెన్  శకంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా తన చెల్లెలు సెరెనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement